అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fake Certificates | ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీ పడుతారు. ఏళ్లకు ఏళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతారు. అయితే పలువురు అభ్యర్థులు మాత్రం నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు కొట్టేస్తున్నారు. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Telangana Police Recruitment Board)ను కొంతమంది అభ్యర్థులు బురిడీ కొట్టించారు. నకిలీ బోనాఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించి మోసం చేశారు. 59 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు నకిలీ పత్రాలు సమర్పించినట్లు రిక్రూట్మెంట్ బోర్డు గుర్తించింది. వారిపై సీసీఎస్‌లో కేసు నమోదు చేసింది. దీంతో సదరు అభ్యర్థులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.
Fake Certificates | హైదరాబాద్‌లో కొలువు కోసం..
రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్ల(Constables) భర్తీకి 2022లో నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారిలో కొందరు నకిలీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసినట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. హైదరాబాద్ నగరం పరిధిలో ఉద్యోగం కోసం స్థానికతను చూపడానికి నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సృష్టించారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన 59 మందిలో 54 మంది కానిస్టేబుల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్(Constable Selected Candidates) అని అధికారులు తెలిపారు. వీరు ఇప్పటికే ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగం సాధింపచారు.
Fake Certificates | అప్రమత్తమైన అధికారులు
ప్రస్తుతం దేశంలో నకిలీ సర్టిఫికెట్ల దందా జోరుగా సాగుతోంది. అయితే ఏకంగా పోలీస్ శాఖ(Police Department)లోనే ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించడం తీవ్ర కలకలం రేపుతోంది. క్రమశిక్షణగా ఉండాల్సిన కానిస్టేబుల్ అభ్యర్థులు దొంగ సర్టిఫికెట్లు సమర్పించడంపై శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జాయినింగ్ సమయంలో ఫేక్ సర్టిఫికెట్లు(Fake Certificates) పెట్టిన వీరు భవిష్యత్‌లో ఎలాంటి మోసాలు చేస్తారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు ఇప్పటికే నకిలీ బోనాఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిపై సీసీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఆ అభ్యర్థుల శిక్షణను నిలిపివేసి, చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లు వెలుగులోకి రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. ఇంకా ఎవరైనా ఇలా నకిలీ పత్రాలు ఇచ్చారా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.