అక్షరటుడే, వెబ్డెస్క్ : Facebook Friendship | సోషల్ మీడియాలో (Social Media) పరిచయాలు కొన్నిసార్లు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని అనడానికి తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మైనర్ బాలికను (Minor Girl) కలవడానికి వెళ్లిన ఓ యువకుడిని, ఆమె కుటుంబ సభ్యులు బంధించి 13 గంటల పాటు చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం బయటకు వచ్చింది.
Facebook Friendship | చిత్ర హింసలు..
వివరాల ప్రకారం, రేవా జిల్లా బైకుంఠ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడికి, మౌగంజ్ జిల్లా (Mauganj district) పిప్రాహి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో ఫేస్‌బుక్ (Facebook) ద్వారా పరిచయం ఏర్పడింది. ఇటీవల ఆమెను కలవాలనే ఉద్దేశంతో శ సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, యువకుడు పిప్రాహి గ్రామానికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు అతడిని పట్టుకొని, అతని చేతులు, కాళ్లు తాడుతో కట్టి, శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు తీవ్రంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేశారు. ఆ దృశ్యాలను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలు వైరల్ కావడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై రేవా ఎస్పీ ఆర్.ఎస్. ప్రజాపతి స్పందిస్తూ, “సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మైనర్ బాలికను కలవడానికి వచ్చిన యువకుడిని, బాలిక కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురి చేసినట్లు వీడియోలు స్పష్టంగా చూపిస్తున్నాయి,” అని తెలిపారు. అలాగే, “ఇప్పటివరకు హనుమాన పోలీస్ స్టేషన్‌లో (Hanumana Police Station) ఎటువంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదు.
అయినా, మేము వీడియో ఆధారంగా పూర్తి విచారణ ప్రారంభించాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇన్‌చార్జ్ అధికారిని ఆదేశించాం అని వివరించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాలిక మైనర్ అయినప్పటికీ, యువకుడిపై చేసిన అమానుష దాడికి కుటుంబ సభ్యుల క్షమాపణలతో సరిపోదు, న్యాయపరమైన చర్యలు తప్పవని కొందరు అభిప్రాయపడుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమర్థనీయం కాదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.