అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Railway Trial Run | మనోహరాబాద్ (Manoharabad) నుంచి కొత్తపల్లి రైల్వే లైన్ పనులు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిద్దిపేట నుంచి చిన్న కోడూరు (Chinna Kodur) వరకు 15 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ట్రాక్‌పై ట్రయల్ రన్ నిర్వహించారు.
హైదరాబాద్ నగరం నుంచి కరీనంగర్ జిల్లాకు (Karinangar District) కనెక్టివిటీ కల్పించడానికి మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మిస్తునారు. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్‌లోని కొత్తపల్లి వరకు రైల్వేలైన్ పనులు సాగుతున్నాయి. 2016లో పనులు ప్రారంభం కాగా.. పూర్తవడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.
Railway Trial Run | వేగంగా పనులు
మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే పనులు ఇప్పటికే 50 శాతం పైగా పూర్తయ్యాయి. సిరిసిల్ల సమీపంలో రైల్వే పట్టాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కొత్తపల్లి (కరీంనగర్) వరకు చేరడానికి మరొక మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఉత్తరాది నగరాలకు ప్రత్యామ్న్యాయ మార్గం అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాలంటే కాజీపేట – పెద్దపల్లి మీదుగా వెళ్లాల్సి వస్తుంది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి మార్గం అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో సైతం పలు రైళ్లు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.
Railway Trial Run | ప్రముఖ పుణ్యక్షేత్రాలు
కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ ప్రముఖ పుణ్యక్షేత్రాల మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో కొమురవెల్లి మల్లన్న ఆలయం (Komuravelli Mallanna Temple), వర్గల్ సరస్వతి దేవి ఆలయం (Vargal Saraswati Devi Temple), వేములవాడ రాజన్న ఆలయాలు (Vemulawada Rajanna Temple) ఉన్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 90 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. మిగతా పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో భూసేకరణ పనులు కూడా పూర్తయ్యాయి అని సమాచారం. వేములవాడలోని మానేరు నది మీద సుమారుగా 2 కిలోమీటర్ల రైల్వే వంతెన నిర్మించడానికి ప్రతిపాదనలు కూడా చేశారు.
ప్రస్తుతం ఈ మార్గంలో సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తవడంతో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. పూర్తి మార్గం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే వేములవాడ, కొమురవెల్లి మల్లన్న ఆలయాలకు వచ్చే భక్తులకు సైతం రవాణా సౌకర్యం మెరుగవుతంది.