అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice-Presidential elections : భారత్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రసవత్తంగా మారాయి. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ తన పదవి నుంచి వైదొలిగడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.
తన పదవీకాలం ముగియకుండానే జగదీప్ ధన్‌ఖడ్ 21 జులై 2025న రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు (Tamil Nadu) నేత, ప్రస్తుత మహారాష్ట్ర (Maharashtra) గవర్నర్ (Governor) సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ కూటమి బరిలో నిలిపింది. సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి బరిలో దించింది.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాధాకృష్ణన్ ఇద్దరు కూడా దక్షిణ భారత్‌కు చెందినవారే కావడంతో ఈ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి (Vice-Presidential) ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవి ప్రత్యేకలు ఏమిటో ఓసారి తెలుసుకుందామా..
పదవీకాలం : భారత్‌లో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి హోదా. ఉపరాష్ట్రపతి పదవీకాలం ఐదేళ్లు. కొన్ని సందర్భాల్లో తదుపరి వ్యక్తిని నియమించే వరకు పదవీకాలంతో సంబంధం లేకుండా కొనసాగొచ్చు.
తొలగింపు : రాజ్యసభ(Rajya Sabha)కు ఉపరాష్ట్రపతి ఎక్స్-అఫిషియో ఛైర్మన్ / ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతి సమర్పిస్తారు. అలా పదవి నుంచి వైదొలగొచ్చు.
ఇంకా రాజ్యసభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా తొలగించవచ్చు. ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో సభలోని మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదించాలి. దీనిని లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
అర్హతలు : భారతీయ పౌరులై ఉండటం, 35 ఏళ్ల పైబడి వయసు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఎలాంటి పదవి కూడా కలిగి ఉండకపోవడం.
ఎన్నిక ప్రక్రియ: రాజీనామా, మరణం వంటి సందర్భాల్లో.. వీలైనంత తొందరగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాలి.
ఎలక్టోరల్ కాలేజీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు.. ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభ (ఎన్నికైన, నామినేటెడ్), లోక్‌సభ సభ్యులు ఉంటారు. వీరు ఓటు వేయడం ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. పార్లమెంట్ సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది.
ఎన్నిక విధానం: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం – 1952, ఉపరాష్ట్రపతి ఎన్నిక నిబంధనలు – 1974, రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తారు.
Vice-Presidential elections : ఎన్నికల నోటిఫికేషన్ ఇలా..
ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసే 16 రోజుల ముందు కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో ఎలక్షన్ కమిషన్ సంప్రదింపులు జరుపుతుంది. ఆ తర్వాత రాజ్యసభ,లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను రిటర్నింగ్ అధికారిగా కమిషన్ నియమిస్తుంది. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం సైతం చేపడుతుంది.
ప్రత్యేక పెన్నులు..
పార్లమెంట్(Parliament)లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఓటింగ్ నిర్వహణ గోప్యంగా ఉండేలా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక పెన్నులు కేటాయిస్తుంది. వీటిని సభ్యులకు ఇస్తుంది. ఇవి కాకుండా వేరేవి వాడితే ఓటు చెల్లదు.
ప్రాధాన్య ఓటు..
అభ్యర్థులకు సభ్యలు ప్రాధాన్య ఓటును వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్ల పక్కన ప్రాధాన్య సంఖ్య వేయాలి. పార్లమెంటు సభ్యులు తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యం ఓటు వేయాలి. మిగతా ప్రాధాన్యం ఓట్లు ఆప్షనల్‌గా వేయాల్సి ఉంటుంది.
విప్ : తమ అభ్యర్థులకే ఓటు వేయాలని సభ్యులకు విప్ జారీ చేసే అధికారం రాజకీయ పార్టీలకు లేదు.
ప్రస్తుతం ఎన్డీఏ, ఇండియా కూటమి బలాబలాలు
ప్రస్తుతం రాజ్యసభ(240), లోక్‌సభ(Lok Sabha)(542)లో కలిపి 786 మంది సభ్యులు ఉన్నారు. కాగా ప్రస్తుతం ఇందులో ఆరు ఖాళీలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బసిర్‌హట్ లోక్‌సభ స్థానం, పంజాబ్‌లో ఒక రాజ్యసభ స్థానం, జమ్మూకశ్మీర్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా, ఓటింగ్ సమయంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఉంటే.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు 394 ఓట్లు కావాల్సి ఉంటుంది.
Vice-Presidential elections : అధికారాలు ఇవే…
- దేశంలో ఏదైనా కారణంతో రాష్ట్రపతి గైర్హాజరైనప్పుడు, అందుబాటులో లేనప్పుడు ప్రెసిడెంట్ బాధ్యతతను ఉపరాష్ట్రపతి నిర్వహించాల్సి ఉంటుంది.
- రాష్ట్రపతి తిరిగి తన పదవీ బాధ్యతలు చేపట్టే వరకు ఉప రాష్ట్రపతే ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు.
- రాష్ట్రపతి రాజీనామా చేయడం, బహిష్కరించబడటం, మరణం లాంటివి సంభవిస్తే.. రాష్ట్రపతి బాధ్యతలను ఉపరాష్ట్రపతి స్వీకరిస్తారు. కాగా, ఆరు నెలల పాటు మాత్రమే ఇలా అవకాశం ఉంటుంది. ఈ ఆరు నెలల్లో రాష్ట్రపతి ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.
- ఉప రాష్ట్రపతి ఎన్నికైన వారే రాజ్యసభ ఛైర్మన్ / ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. రాజ్యసభలో కాస్టింగ్ ఓటు వేసే అధికారం కూడా ఉంటుంది. అంటే ఒక బిల్లు విషయంలో రెండు వర్గాలకు కూడా సరి సమానంగా ఓట్లు వస్తే.. రాజ్యసభ ఛైర్మన్‌గా ఉపరాష్ట్రపతికి ఓటు వేసే అధికారం ఉంటుంది.