అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Online gaming bill | ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting).. ఎన్నో జీవితాలను నాశనం చేసింది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈజీ మనీ కోసం చాలా మంది ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలుగా మారి సర్వం కోల్పోతున్నారు. అప్పుల పాలై తనువు చాలించిన వారూ ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రం ఆన్‌లైన్ బెట్టింగ్ ఆటకట్టించే బిల్లును లోక్‌సభలో ఆమోదించింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ (Betting Apps)పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు రూపొందించిన బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో బుధవారం ఆమోదించారు. విపక్షాల నిరసనల మధ్యే బిల్లుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఎంతో మంది అప్పుల పాలు అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఆన్‌లైన్ బెట్టింగ్స్ నిషేధిస్తూ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది.
Online gaming bill | డబ్బులు పెట్టి ఆడే గేమ్‌లపై..
యువతలో వ్యసనం, ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలను ప్రధాన ఆందోళనలుగా పేర్కొంటూ నగదు లావాదేవీలతో నడిచే ఆన్‌లైన్ గేమ్‌లపై కేంద్రం నిషేధం విధించింది. అంటే డబ్బులు పెట్టి ఆడే అన్ని ఆటలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫాంటసీ క్రీడలు, పోకర్, రమ్మీ వంటి కార్డ్ గేమ్‌లు, ఆన్‌లైన్ లాటరీలతో సహా అన్ని రకాల ఆన్‌లైన్ బెట్టింగ్, జూదంపై నిషేధం విధించింది. అలాంటి ఆటలను ప్రోత్సహించే ప్రకటనలపై కూడా నిషేధం విధించింది.
Online gaming bill | కఠిన చర్యలు
నగదు ప్రోత్సాహకాలను ఎరగ చూపుతున్న గేమింగ్ యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు, బాధ్యులకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.కోటి దాకా జరిమానా విధించనున్నారు. ఆయా గేమ్‌లను ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు రెండేళ్ల దాకా జైలు, రూ.50 లక్షల జరిమానా వేయాలని నిర్ణయించారు. ఇలాంటి గేమింగ్ సంబంధిత నిధులను ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నిషేధం విధించారు. అయితే ఆన్‌లైన్ గేమ్‌లు (Online Games) ఆడేవారిని మాత్రం శిక్షల నుంచి మినహాయించారు. వీరిని బాధితులుగా పరిగణించాలని బిల్లులో పొందుపరిచారు.
Online gaming bill | సజ్జనార్ హర్షం
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) ఎప్పటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తాజాగా లోక్‌సభలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిషేధిస్తూ బిల్లు పాస్ కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్‌తో పాటు మరికొన్నింటినీ నిషేధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఏపీలో ఇప్పటికే బెట్టింగ్‌పై నిషేధం ఉంది. అయినా దొడ్డు దారిలో ఆడిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతరమార్గాల ద్వారా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మళ్లీ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని సజ్జనార్ అన్నారు.