అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | రైతులకు యూరియా (Urea) ఇవ్వలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం పోలీసు బందోబస్తు పెట్టి ఎరువులను పంపిణీ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Former Minister Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనను కొనసాగిస్తోందంటూ నిప్పులు చెరిగారు. నాడు కేసీఆర్ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగితే, నేడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తుందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు.
Harish Rao | ముందుచూపేది..
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే యూరియా కొరత తలెత్తిందని హరీష్‌రావు విమర్శించారు. కేసీఆర్ (KCR) హయాంలో సీజన్‌కు ముందే సరిపడా ఎరువులు నిల్వ ఉంచామని గుర్తు చేశారు. రేవంత్‌కు అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ, యూరియా మీద లేదని అని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు (Farmers) తెల్లందాకా సొసైటీల ఎదుట జాగారం చేయాల్సి వస్తోందన్నారు. 51 సార్లు డిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డికి యూరియా తెచ్చే తెలివి లేదు, ముందుచూపు లేదని మండిపడ్డారు. పోలీసులను పెట్టి యూరియా పంపిణీ చేయడం సిగ్గుచేటని, రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన తెచ్చిండని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష చేయకుండా, ఇంతటి దుస్థితి తీసుకొచ్చారన్నారు.
Harish Rao | రైతుల తిప్పలు..
రాష్ట్రంలో యూరియా కొరతతో (Urea Shortage) రైతులు నానా అవస్థలు పడుతున్నారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదని రాత్రిళ్లు కూడా సొసైటీల ఎదుట బారులు తీరుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) రైతులకు అగ్ర తాంబూలం వేస్తే రేవంత్ ప్రభుత్వం అధఃపాతలానికి తొక్కిందని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుంభ కర్ణుడిలా నిద్రిస్తుందన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఉండేదని, కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక చెప్పులకు చెక్ పెట్టి రైతుల చెంతకు యూరియా అందించిందని గుర్తు చేశారు.
Harish Rao | పాలనలో విఫలం..
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి మండిపడ్డారు. సగంమంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుభరోసా ఎగ్గొట్టారన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ రూ.1300 కోట్లు చెల్లించలేదన్నారు. రుణమాఫీ పేరిట రైతులను ఎంతకాలం ఉసురు పోసుకుంటారని ప్రశ్నించారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులకు (Congress leaders) గ్రామాల్లో తిరిగే హక్కు లేదని, ఊర్లకు వచ్చే మంత్రులను, కాంగ్రెస్ నేతలను తీరగనివ్వం.. ఎక్కడిక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. వెంటనే రైతులకు యూరియా అందించాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
రేవంత్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ (Congress and BJP) రైతులను ముంచాయని మండిపడ్డారు. బడే బాయ్ చోటా బాయ్ కలిసి రైతులకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తీవ్ర యూరియా కొరత తలెత్తితే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన తెచ్చిన రేవంత్ రెడ్డి నోరు విప్పితే కేసీఆర్‌ను తిట్టుడు తప్ప ఇంకోటి లేదన్నారు.