అక్షరటుడే,లింగంపేట: Collector Kamareddy | కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. విద్యాశాఖ (Education Department) ఆధ్వర్యంలో తాడ్వాయి మండలం సంతాయిపేట్ భీమేశ్వరాలయ (Bhimeshwar Temple) పరిసర అటవీ ప్రాంతంలో బుధవారం విత్తన బంతులు విసిరే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అటవీ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి ఆయన సీడ్‌బాల్స్‌ను (Seed Balls) వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటుతూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గ్లోబల్ వార్మింగ్‌ను నివారించాలని సూచించారు.
కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రతి పాఠశాలలోనూ సీడ్‌బాల్స్ తయారు చేశారని.. ఇలా లక్షకు పైగా తయారయ్యాయని కలెక్టర్ వివరించారు.
Collector Kamareddy | లక్షకు పైగా సీడ్‌బాల్స్ తయారీ..
పచ్చదనాన్ని పెంచే విప్లవాత్మకమైన ఈ కార్యక్రమంలో జిల్లా ముందు వరుసలో ఉండడం సంతోషంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించి ఈ బృహత్కర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులను, జిల్లా సైన్స్ అధికారిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమాన్ని ప్రతి ఏడాది విద్యార్థులకు ఒక ప్రాజెక్ట్ వర్క్‌గా ఇచ్చి 2 లక్షల సీడ్‌బాల్స్‌ను తయారుచేయించి, ప్రతి ఏడాది వర్షాలు పడగానే అడవుల్లో వేయించే విధంగా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ సూచించారు.
గ్రామాల్లో, పట్టణాల్లో ఇబ్బందులు పెడుతున్న కోతులు తిరిగి అడవుల్లోకి వెళ్లిపోవాలంటే పండ్ల విత్తనాలతో చేసిన సీడ్‌బాల్స్ అడవుల్లో వేస్తే వన్యప్రాణులకు ఆహారం ఇచ్చిన వాళ్లమవుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులకు ప్రజలకు అవగాహన కలుగుతుందన్నారు.
Collector Kamareddy | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
తాడ్వాయి మండలంలోని చిట్యాల, సంతాయిపేట గ్రామాల్లో బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సంతాయిపేట గ్రామంలో డెంగీ, డయేరియా వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం భీమేశ్వరాలయ పరిసరాలను పరిశీలించారు. వరదలు ఎక్కువ ఉన్న దృష్ట్యా రైతులు పంట పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదలు ఉన్నందున వాగుల వైపు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో డీఈవో రాజు (DEO Raju), ఇరిగేషన్ ఈఈ మల్లేష్, ఎంపీడీవో సాజిద్ అలీ, ఎంపీవో సరిత రెడ్డి, ఎంఈవో రామస్వామి, అటవీ శాఖ అధికారులు, భిక్కనూరు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, పాల్వంచ, కృష్ణాజివాడి, చిట్యాల, సంతాయి పేట్ పాఠశాల విద్యార్థులతో పాటు జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.