అక్షరటుడే, కామారెడ్డి: National Raktha Veer Awards | కామారెడ్డి పట్టణ వాసులకు జాతీయస్థాయిలో రక్తవీర్ పురస్కారాలు లభించాయి. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని అశోక హోటల్లో పురస్కారాల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఐవీఎఫ్ సేవాదళ్(IVF Seva dal) రాష్ట్ర ఛైర్మన్, రెడ్‌క్రాస్ (Redcross) జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు వ్యక్తిగతంగా 77సార్లు రక్తదానం చేయగా, తలసేమియా (Thalassemia) చిన్నారుల కోసం నాలుగు వేలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి అందజేసినందుకు గాను జాతీయ రక్తవీర్ పురస్కారాన్ని అందుకున్నారు.
అలాగే కామారెడ్డి రక్తదాతల సమూహ (Kamareddy Blood Donors Group) ఉపాధ్యక్షుడు, ఆర్యవైశ్య మహాసభ (Arya Vaishya Mahasabha) జిల్లా ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ వ్యక్తిగతంగా 26 సార్లు రక్తదానం చేయగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించినందుకు గాను జాతీయ రక్తవీర్ పురస్కారాన్ని అందుకున్నారు. వీరిరువురికి లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రవీందర్ గుప్తా, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందజేశారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ.. 18 ఏళ్ల నుండి రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, ఇప్పటివరకు 25వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను తలసేమియా చిన్నారుల కోసం నిర్వహిస్తామని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం మరింతగా కృషి చేస్తానని తెలిపారు. గంప ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
అవార్డు అందుకుంటున్న గంప ప్రసాద్