అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tomato Price | టమాట ధరకు రెక్కలొచ్చాయి. మొన్నటివరకు చౌకగా ఉన్న టమాట ఇప్పుడు ఖరీదుగా మారింది. నాలుగు రోజుల క్రితం కిలో రూ.20 నుంచి రూ.30 పలికిన టమాట ప్రస్తుతం రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. హోల్‌సేల్‌లో రూ.40-50 వరకు ఉంది. భారీ వర్షాల(Heavy Rain) నేపథ్యంలో టమాట దిగుమతులపై ప్రభావం పడింది. సరైన కాత లేకపోవడం, కుళ్లిపోతుండడంతో దిగుబడి తగ్గిందని చెబుతున్నారు. అదే సమయంలో డిమాండ్, సరఫరాలో అంతరం ఏర్పడడంతో రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
Tomato Price | భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి..
తెలుగు రాష్ట్రాల్లో టమాట వినియోగం ఎక్కువగా ఉంటుంది. అన్ని కూరల్లోనూ దీన్ని వాడుతారు. ఈ నేపథ్యంలో ఏ సీజన్‌లోఅయినా టమాట కు డిమాండ్ ఉంటుంది. అయితే, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో టమాట పంట దిబ్బ తింది. అలాగే, కాత దెబ్బ తినడం, కుళ్లిపోవడంతో దిగుబడి తగ్గిపోయింది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టమాట ధర(Tomato Price)కు రెక్కలొస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్(Hyderabad Market)లో కిలో రూ.70 దాకా చేరింది. ఏపీలోని విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో ధర కేజీ రూ.50-60 పలుకుతోంది. అతిభారీ వర్షాలు, వరదలతో టమాటా పంట తీవ్రంగా దెబ్బతినడంతోనే సరఫరా తగ్గి ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.