అక్షరటుడే, వెబ్డెస్క్: Kurnool District | ఆదాయం కోసం కూలీ పనికి వెళ్లిన ఓ వ్యక్తి జీవితం ఇట్టే మారిపోయింది. రోజు ఎంతో కొంత డబ్బు వస్తే చాలని అనుకుంటూ, పొలంలో మట్టిపనులు చేస్తూ తిరుగుతున్న ఓ వ్యక్తికి విలువైన వజ్రం దొరికింది. దాంతో లక్షాధికారి అయ్యాడు.
ఇప్పుడు ఈ సంఘటన రాయలసీమ (Rayalaseema) అంతటా సంచలనం సృష్టిస్తోంది. కర్నూలు జిల్లా (Kurnool District) తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి కూలీ పని కోసం వెళ్లాడు. ఓ రైతు పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా మట్టిలో మెరుపులాంటి రాయి కనిపించింది. తొలుత అది రంగు రాయిగా అనుకున్నా.. ఏదో భావించి జేబులో వేసుకున్నాడు. అనుమానంతో అది స్థానిక వజ్రాల వ్యాపారిని చూపించగా, అది నిజంగా ఖరీదైన వజ్రం (Expensive Diamond) అని తేలింది. ఆ వ్యాపారి దాన్ని ఏకంగా రూ.40 లక్షలకు కొనుగోలు చేశాడట.
Kurnool District | అదృష్టం మారింది..
దీంతో కూలీ ఏకంగా లక్షాధికారి అయ్యాడు. అయితే ఆ వజ్రం కొనుగోలు చేసిన వ్యాపారి (Diamond Merchant) ఎవరోనేది మాత్రం గోప్యంగా ఉంది. రాయలసీమలో వర్షాకాలం అంటే వజ్రాల వేటకు సీజన్ మొదలైనట్టే. ముఖ్యంగా వజ్రకరూర్ (అనంతపురం), జొన్నగిరి (కర్నూలు) వంటి ప్రాంతాల్లో ప్రతి వర్షాకాలం వజ్రాల కోసం ప్రజలు ఎగబడతారు. స్థానికులే కాదు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వజ్రాల వేటకు వస్తారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎక్కువ వజ్రాలు దొరుకుతాయని నమ్మకం. ప్రతి ఏడాది 40–50 వజ్రాలు దొరికుతాయని స్థానికులు చెబుతున్నారు.
తెల్లవారుజాము నుంచి చీకటి దాకా వజ్రాల కోసం మట్టిలో వెతుకుతుంటారు. వర్షం కురిసిన తర్వాత మట్టిలో మెరుస్తున్న రాళ్లు ఎక్కువగా కనిపిస్తాయని నమ్మకం ఉంది. వజ్రం దొరికితే దాన్ని ఎవరికీ చెప్పరు. ఎక్కడో ఒక ముఠా వచ్చి వాటిని తనిఖీ చేసి, వాటి విలువ అంచనా వేస్తుంది. తర్వాత వ్యాపారులు వాటిని కొనుగోలు చేస్తారు. అన్నీ గోప్యంగానే జరుగుతాయి. ఒక్క వజ్రం దొరికితే జీవితమే మారిపోతుందనే ఆశతో వందలాది మంది పొలాల్లో గాలిస్తూ తిరుగుతున్నారు. అయితే అదృష్టం ఉంటేనే మనకు వజ్రం కనిపిస్తుంది. ఏది ఏమైనా రూ.300 కూలీకి పని చేసుకునే వ్యక్తికి ఏకంగా రూ.40 లక్షల వజ్రం లభించడంతో ఒక్కసారిగా వార్తలకెక్కాడు. అతడి జీవితం ఒక్కరోజులోనే మారిపోయింది. ఇది విన్న ఇతరులూ ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కర్నూలు పొలాల దిశగా అడుగులు వేస్తున్నారు.