అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు ఏ మాత్రం భయపడటం లేదు. ఏసీబీ అధికారులు నిత్యం దాడులు (ACB Raids) చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. డబ్బులు తీసుకోనిదే పనులు చేయడం లేదు. తాజాగా ఇంటి నంబర్ కేటాయించడం కోసం లంచం డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో బి రమేశ్ సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మున్సిపల్ పరిధిలో ఓ వ్యక్తి షెడ్డు నిర్మించుకున్నాడు. సదరు షెడ్డుకు ఇంటి నంబర్ (House Number) కోసం మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాడు. దీనికోసం సీనియర్ అసిస్టెంట్ (Senior Assistant) రమేశ్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు మంగళవారం రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రమేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ACB Trap | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్యాలయాలు (Municipal Offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా కార్యాలయాల్లో పలువురు సిబ్బంది ఏళ్లుగా తిష్ట వేసి ప్రజల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలుకొని.. ఇంటి అనుమతుల వరకు ప్రతి దానికి ఒక రేటు పెట్టి లంచాలు తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు చేయడం లేదు. కొంత మంది అధికారులు దళారుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు.
ACB Trap | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.