అక్షరటుడే, బోధన్: Indiramma Housing Scheme | జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లల్లో పురోగతి కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యాయి. వీటిని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మంగళవారం అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి పరిశీలించారు.
జైతాపూర్‌లో 74 ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పనులు ప్రారంభమై, వివిధ దశలలో కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వీటిలో 15 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్.. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను గుర్తించిన ఆయన యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు చెల్లింపులు పూర్తయ్యాయా.. అని ప్రశ్నించగా.. చివరి బిల్ చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు. వెంటనే బిల్లులు మంజూరు చేసి విద్యుత్ కనెక్షన్, మిషన్ భగీరథ నీటి సరఫరా (Bhagiratha Water Supply) వంటి సదుపాయాలను సత్వరమే కల్పించాలని ట్రాన్స్‌కో ఏఈ ముఖ్తర్ను, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాకేష్‌కు సూచించారు.
ప్రారంభోత్సవాల నాటికి, ఏ ఒక్క చిన్న పని కూడా పెండింగ్‌లో లేకుండా, అన్ని వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ఇళ్ల ఆవరణలో ఖాళీ స్థలం ఉన్నచోట పూలు, పండ్ల మొక్కలు నాటించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో, అర్హులైన ఇతర లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. కాగా, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల విషయంలో అనవసర ఆడంబరాలకు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు హితవు పలికారు.
అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలోనే వాటికి ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని తెలిపారు. జైతాపూర్‌లో 15 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయని, వారం రోజుల్లో వాటికి ప్రారంభోత్సవాలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్దిదారులు అందరూ వెంటనే నిర్మాణాలను చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ పవన్ కుమార్, నివర్తి, స్థానిక అధికారులు ఉన్నారు.