అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rains | దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, జన జీవనం స్తంభించింది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతులకుతలమైంది.
మంగళవారం ఉదయం కురిసిన వానతో ముంబై తడిసి ముద్దయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Chhatrapati Shivaji Maharaj International Airport)లో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు 250 విమానాల రాకపోకలపై వర్షాల ప్రభావం పడింది. 155 విమానాలు ఆలస్యంగా బయల్దేరాయి. వాతావరణం అనుకూలించక పోవడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు.
Heavy Rains | 20 సెం.మీ వర్షపాతం..
కుండపోత వర్షంతో ముంబై(Mumbai)లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టాలపైకి నీళ్లు రావడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదర్, మాతుంగా, పరేల్, సియోన్, హింద్‌మాతా, అంధేరి సబ్‌వే, తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేలోని కొన్ని ప్రాంతాలు, ముంబై-గుజరాత్ హైవే, తూర్పు ఫ్రీవే వంటి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. మరోవైపు, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(Brihanmumbai Municipal Corporation) సూచించింది. వర్క్ ఫ్రమ్ హోం కు అవకాశం కల్పించాలని కార్పొరేట్ సంస్థలను కోరింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. ఈ మేరకు ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో ముంబైలోని అనేక ప్రాంతాల్లో 20సెంటి మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.