అక్షరటుడే, నిజాంసాగర్ : Nizam Sagar | ఉమ్మడి జిల్లా వర ప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్ట్(Nizamsagar Project)కు భారీగా వరద వస్తుంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో జలాశయం 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మంజీర నది పరవళ్లు తొక్కుతోంది.
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో మంజీర నది (Manjira River)కి భారీగా వరద వస్తోంది. సింగూరు ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా పూర్తిస్థాయిలో నింపొద్దని ఎన్డీఎస్ఏ అధికారులు (NDSA Officers) సూచించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 29 టీంఎసీలు అయినా.. 22 టీఎంసీలు నీరు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. మిగతా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Nizam Sagar | జలదిగ్బంధంలో దుర్గమ్మ ఆలయం
సింగూరు నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండడంతో మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వద్ద మంజీర నది ఉగ్రరూపం దాల్చింది. వనదుర్గా భవానీ మాత పాదాలను తాకుతూ మంజీర పారుతోంది. వారం రోజులుగా ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో నిత్య పూజలు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో భక్తులను అనుమతించడం లేదు.
Nizam Sagar | 83 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్‌లోకి సింగూరు, పోచారం ప్రాజెక్ట్‌ల నుంచి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.80 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 143.61 (15.81 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. దీంతో 15 గేట్ల ద్వారా 85 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Nizam Sagar | 35 ఏళ్ల తర్వాత
నిజాంసాగర్‌కు భారీ వరద (Heavy Flood) వస్తే.. గుల్దస్తా వద్ద గల 12 వరద గేట్లు, గణపతి ఆలయం వద్ద గల 16 వరద గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఆరేడు గ్రామ శివారులో 20 వరద గేట్లు ఉన్నాయి. ఈ గేట్ల ద్వారా చివరగా 1989లో నీటిని విడుదల చేశారు. 35 ఏళ్ల తర్వాత మళ్లీ మంగళవారం (నేడు) మధ్యాహ్నం ఈ గేట్ల ద్వారా నీటి విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద గేట్ల పనితీరును పరిశీలించేందుకు నీటి విడుదల చేపడతామని అధికారులు తెలిపారు.