అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ (SRSP) నిండుకుండలా మారడంతో అధికారులు 39 వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 2.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5టీఎంసీలు) కాగా.. మంగళవారం ఉదయం 10 గంటలకు 1089 (73.37 టీంఎసీలు) అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో 39 వరద గేట్ల ద్వారా 2,32,418 క్యూసెక్కులు గోదావరి (Godavari)లోకి విడుదల చేస్తున్నారు.
Sriram Sagar | వరద కాలువ ద్వారా..
శ్రీరామ్‌సాగర్‌కు ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతుండటంతో వరద కాలువ (Flood Canal) ద్వారా మిడ్‌మానేరుకు నీటిని తరలిస్తున్నారు. ఆదివారం వరద కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. మొదట 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు క్రమంగా పెంచారు. ప్రస్తుతం ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 18 వేల క్యూసెక్కులను మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4,700 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి మొత్తం ఔట్ ఫ్లో 2,59,285 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ నుంచి దిగువకు భారీగా నీటిని వదులుతుండటంతో దిగువన గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి సూచించారు. నది సమీపంలోకి వెళ్లొద్దన్నారు.
Sriram Sagar | మిడ్ మానేరుకు జలకళ
ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో మిడ్‌మానేరు (Mid Maneru) జలకళను సంతరించుకుంది. సోమవారం వరకు నాలుగు మోటార్ల ద్వారా నంది, గాయత్రి పంపుహౌస్‌ల నుంచి మిడ్ మానేరుకు అధికారులు నీటిని తరలించారు. అయితే ఎస్సారెస్పీకి వరద కొనసాగుతుండటంతో ఎలాంటి ఖర్చు లేకుండా మిడ్ మానేరు నిండే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఒక మోటారు ద్వారా మాత్రమే 3వేల క్యూసెక్కులు మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు.
ఎస్సారెస్పీ నుంచి 18 వేల క్యూసెక్కులు వరద కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో మిడ్‌మానేరు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 25 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. స్థానికంగా కురిసిన వర్షాలతో మానేరు వాగు ద్వారా కూడా డ్యామ్‌లోకి ఇన్‌ఫ్లో వస్తోంది.