అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌లు (Projects) నిండుకుండలా మారాయి. మంగళవారం సైతం తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో సోమవారం రోజంతా ముసురు పెట్టింది. రాత్రి పూట మోస్తరు నుంచి భారీ వాన పడింది. వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయి.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రతాపం చూపుతున్న వరుణుడు హైదరాబాద్ (Hyderabad)పై మాత్రం కరుణ చూపుతున్నాడు. భారీ వర్షాలు పడితే నగరం అతలాకుతలం అవుతంది. వారం రోజులుగా నగరంలో పగటి పూట చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయి. రాత్రి సమయంలో మోస్తరు వానలు పడుతున్నాయి. దీంతో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మంగళవారం సైతం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.
Weather Updates | ఈదురుగాలులు..
రాష్ట్రంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. మంగళవారం రోజంతా ముసురు పెట్టినట్లు వాతావరణం చల్లగా ఉండనుంది. దీంతో పాటు చలిగాలులు వీస్తాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 40–55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
Weather Updates | అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ఎక్కడ చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటల నుంచి మొదలు కొని భారీ ప్రాజెక్ట్‌ల వరకు నిండాయి. వాగులు, నదులు (Rivers) ఉధృతంగా పారుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు పడుతున్న సమయంలో చేపల వేటకు వెళ్లొద్దు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులు, ప్రాజెక్ట్‌ల సమీపంలోకి వెళ్లొద్దు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి. రైతులు బోరు మోటార్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలి.