అక్షరటుడే, వెబ్‌డెస్క్: TaskForce Police | నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్‌ను (Commissionerate Task Force) పూర్తిస్థాయి ప్రక్షాళన చేశారు. ఒకే రోజులో ఏకంగా 14 మందిపై బదిలీ వేటు వేశారు. వీరిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, మిగతా వారు సిబ్బంది ఉన్నారు. కాగా.. సీపీ తీసుకున్న నిర్ణయం కమిషనరేట్ పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
కమిషనరేట్‌లోని టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై మొదటి నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విభాగంలో పనిచేసిన ఏసీపీ విష్ణుమూర్తి (ACP Vishnu Murthy) తీవ్ర అవినీతి ఆరోపణల కారణంతో విధుల నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఈ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రస్తుతం ఈ విభాగంలో పనిచేస్తున్న కొందరి తీరు మాత్రం మారలేదు. ఇటీవల ఏఆర్ నుంచి టాస్క్‌ఫోర్స్ అటాచ్ చేసిన పలువురి పనితీరుపై విమర్శలు వచ్చాయి. కాగా.. టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది తీరుపై కొద్దిరోజులుగా పర్యవేక్షణ జరిపిన సీపీ సాయిచైతన్య తనదైన శైలిలో ప్రక్షాళన చేపట్టారు.
TaskForce Police | సీఐ, ఇద్దరు ఎస్సైలు..
ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ విభాగంలో (task force department) పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ అంజయ్యను సీసీఆర్బీకి బదిలీ చేశారు. అలాగే ఎస్సై గోవింద్‌ను ఆర్మూర్‌కు, మరో ఎస్సై శివరాంను సీసీఆర్బీకి అటాచ్ చేశారు. సిబ్బంది యాకుబ్ రెడ్డిని సీసీఆర్బీకి, లస్మన్నను భీమ్‌గల్ పీఎస్‌కు, సుధీర్‌ను రెంజల్ పీఎస్‌కు, అనిల్ కుమార్‌ను సీసీఎస్‌కు, రాజును బోధన్ టౌన్‌కు పంపించారు. సచిన్‌ను భీమ్‌గల్‌కు, అన్వర్‌ను బోధన్ టౌన్‌కు, అనిల్, శ్రీనివాస్, ఎన్.సచిన్, సాయినాథ్‌లను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. సత్వరమే ప్రస్తుత స్థానం నుంచి రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
TaskForce Police | కొత్తవారికి ఛాన్స్
అసాంఘిక కార్యకలాపాలు (anti-social activities), అక్రమ రవాణా తదితర నేరాల కట్టడిలో టాస్క్‌ఫోర్స్ పాత్ర ఎంతో కీలకం. ఇందులో పనిచేసే అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పక్కాగా నిఘా ఉంచి దాడులు జరిపితేనే అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. కానీ కొందరు అధికారులు, సిబ్బంది అక్రమార్కుల నుంచి మామూళ్లు తీసుకోవడం పోలీస్ శాఖకే (police department) చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసిన కమిషనరేట్ బాస్ సాయిచైతన్య త్వరలోనే కొత్తవారిని నియమించనున్నారు. ఇందుకోసం ఎలాంటి రిమార్కు లేని వారికోసం టాస్క్‌ఫోర్స్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.