అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Rains | అమీర్‌పేట మెట్రో స్టేషన్ (Ameerpet Metro Station), మైత్రివనం వద్ద వరద ఉధృతిని కట్టడి చేయడంపై హైడ్రా దృష్టి సారించింది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచన మేరకు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేకంగా ట్రంకు లైను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
అంతేకాకుండా తాత్కాలిక ఉపశమనానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై హైడ్రా దృష్టిపెట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) సోమవారం అమీర్‌పేట మైత్రివనం పరిసరాల్లో వరద కాల్వలకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. అలాగే కృష్ణాకాంత్ పార్కులోని (Krishnakanth Park) చెరువు, వరద కాల్వలను తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 10, వెంకటగిరి, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్ నుంచి కృష్ణాకాంత్ పార్కు మీదుగా పారే వరద కాల్వలను పరిశీలించారు. పై నుంచి భారీగా వస్తున్న వరదను చెరువుకు మళ్లిస్తే చాలావరకు ఉధృతిని కట్టడి చేయవచ్చనే అభిప్రాయానికి హైడ్రా కమిషనర్ వచ్చారు.
Hyderabad Rains | చెరువుకు మళ్లించి..
వరదను కృష్ణాకాంత్ పార్కులో (Krishnakanth Park) ఉన్న చెరువుకు మళ్లించి కొంత వరకు ఉధృతిని తగ్గించవచ్చని హైడ్రా కమిషనర్ భావిస్తున్నారు. పార్కులో 7 ఎకరాల మేర చెరువు ఉండగా.. 12 ఎకరాల వరకూ విస్తరించే వీలుంది. ఇలా 120 మిలియన్ లీటర్ల నీటిని కొన్ని గంటలు హోల్డ్ చేసి.. వర్షం తగ్గిన తర్వాత కిందకు వదిలితే వరద ఉధృతిని కొంతవరకు తగ్గుతుందని భావించారు. ప్రస్తుతం పార్కులోని చెరువులోకి నీరు వెళ్లకుండా.. మధురానగర్ మీదుగా అమీర్‌పేటకు రావడంతో మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నిలిచిపోతోందని అభిప్రాయపడ్డారు. పార్కులోని చెరువు నుంచి మధురానగర్ మీదుగా అమీర్‌పేట మెట్రో స్టేషన్ వరకు 1100 మీటర్ల బాక్సు డ్రెయిన్ ఉంది. అమీర్‌పేట వద్ద భూమి సమాంతరంగా ఉండడంతో పైనుంచి భారీగా వచ్చిన వరద (heavy floodwater) కిందకు వెళ్లడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని హైడ్రా అధికారులు కమిషనర్‌కు తెలిపారు.
Hyderabad Rains | జీపీఆర్ ఎస్ ఆటంకాలను గుర్తించాలి..
అమీర్‌పేట – సంజీవరెడ్డి నగర్ (Ameerpet – Sanjeeva Reddy Nagar) రహదారిని వరద నీరు దాటేందుకు వేసిన పైపు లైన్లలో ఉన్న ఆటంకాలను గుర్తించేందుకు జీపీఆర్ఎస్ సర్వే చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. దీని ద్వారా పైపులైన్లలో (Pipe Line) పేరుకుపోయిన పూడికను గుర్తించడం జరుగుతుందన్నారు. తొలగించడానికి వీలుకాని పక్షంలో బాక్సు డ్రైన్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించవచ్చని పేర్కొన్నారు. అప్పటి వరకు మెట్రో స్టేషన్ కింద ఉన్న పైపులైన్ నుంచి వరద నీరు సాఫీగా పారేలా చూడాలని కమిషనర్ సూచించారు. సారథి స్టూడియో పక్కన నుంచి.. మధురానగర్ మీదుగా వచ్చే వరద కాల్వలు రోడ్డు దాటినప్పుడు తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడం వల్ల ఇబ్బందులు ఉండబోవని అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళిక.. తాత్కాలిక ఉపశమనం కల్పించడంపై దృష్టి సారించాలని హైడ్రా అధికారులను కమిషనర్ ఆదేశించారు.