అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 13 వరద గేట్లు ఎత్తి మంజీరలోకి నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టును తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల (Irrigation Department), పోలీసు శాఖల (police department) అధికారులు అలర్ట్ అయ్యారు.
ప్రాజెక్టుపైకి పర్యాటకులను (Tourists) ఎవరినీ రానివ్వట్లేదు. సుల్తాన్ నగర్ (Sulthan Nagar) గ్రామ శివారులో బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రాజెక్టుకు సుమారు 4 కి.మీ దూరం నుంచే వాహనాలను అడ్డుకుంటున్నారు. దీంతో పర్యాటకులు వాహనాలను అక్కడే పార్క్చేసి నడుచుకుంటూ ప్రాజెక్టుపైకి చేరుకుంటున్నారు. అయితే ప్రాజెక్టుపైకి వెళ్లిన పర్యాటకులకు అక్కడ కూడా నోఎంట్రీ బోర్డులు పెట్టడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
Nizamsagar | అచ్చంపేట వాసులకు అవస్థలు..
దీనికి తోడు నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట (Achampet) గ్రామానికి వెళ్లే గ్రామస్థులను సైతం అధికారులు అడ్డుకుంటున్నారు. గతంలో ప్రాజెక్టు గుండా అచ్చంపేట వాసులు రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం వారిని కూడా ప్రాజెక్టు గుండా వెళ్లనీయకపోవడంతో వారు 15 కి.మీ దూరం తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని అచ్చంపేట, లింగంపల్లి, మర్పల్లి వాసులు వాపోతున్నారు.