అక్షరటుడే, ఎల్లారెడ్డి: Raktha Veera Award | రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి సేవ చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరుష వెంకటరమణకు జాతీయ రక్తవీర అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన మంగళవారం న్యూఢిల్లీలోని (New Delhi) అశోక హోటల్లో అవార్డు అందుకోకున్నారు.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ.. 2023లో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం నాలుగు యూనిట్ల రక్తాన్ని సేకరించానని.. అప్పటి నుంచి ఇప్పటివరకు 2,306 యూనిట్ల వరకు రక్తాన్ని సేకరించానని ఆయన వెల్లడించారు. కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని (Kamareddy blood donor group) ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) (International Vysya Federation) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు.
దీంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఇండియా బుక్ఆఫ్ రికార్డ్స్‌లో (India Book of Records) నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలోని గండిమాసానిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను చిన్నారుల కోసం చేస్తున్న సేవలో సంతృప్తి లభిస్తుందని వెల్లడించారు. 18ఏళ్లుగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాల్లో పాల్గొంటున్నానన్నారు.
ఈ పురస్కారం అందుకోవడానికి సహకరించిన రక్తదాతలకు, రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వారికి వెంకటరమణ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ అవార్డు ఎంపికకు సహకరించిన ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, ఐవీఎఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.