అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lok Sabha Speaker | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం ఉదయం సమావేశమైన ఉభయ సభలూ కాసేపటికే వాయిదా పడ్డాయి. బీహార్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను (Special Intensive Revision) వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి.
దీంతో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగలేదు. లోక్‌సభ సమావేశం(Lok Sabha Session) ప్రారంభం కాగానే స్పీకర్ ఓంబిర్లా జీరో అవర్(Zero Hour) ప్రారంభించగా, అడ్డుకున్న ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుండడంతో స్పీకర్ వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీరు నినాదాలు చేస్తున్న తరహాలోనే అదే తీవ్రతతో సభలో ప్రశ్నలు లేవనెత్తాలని, దీనివల్ల దేశ ప్రజలకు ప్రయోజనాలు కలుగుతాయని హితవు పలికారు. “మీరు నినాదాలు చేస్తున్న తీవ్రతతోనే ప్రశ్నలు అడిగితే, అది దేశ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడకు పంపలేదు. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసే అధికారం ఏ సభ్యునిడి లేదని” అని స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) పేర్కొన్నారు.
Lok Sabha Speaker | కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు..
తరచూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే “నిర్ణయాత్మక చర్య” తీసుకుంటామని స్పీకర్ విపక్ష ఎంపీలను హెచ్చరించారు. “మీరు ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే, నేను కొన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మీ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్న సభ్యులపై అనేక అసెంబ్లీలు(Assemblies) గతంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ దిశగా నేను నిర్ణయం తీసుకోకునేలా వ్యవహరించొద్దని మిమ్మల్ని మళ్లీ హెచ్చరిస్తున్నాను. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించవద్దు” అని ఓం బిర్లా హెచ్చరించారు.
Lok Sabha Speaker | రాజ్యసభలోనూ అంతే..
రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు నిలబడి ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ సజావుగా కొనసాగేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు కోరినా వారు వినలేదు. “దయచేసి సభను పని చేయనివ్వండి. ఇది జీరో అవర్,” అని హరివంశ్ సూచించినా ఆందోళన ఆపలేదు. దీంతో సభను వాయిదా వేశారు.