అక్షరటుడే, నిజాంసాగర్ : Manjira River | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి భారీ ఎత్తున వరద వస్తోంది. సింగూరు పరీవాహక ప్రాంతాల నుంచి సుమారు 85,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో నిజాంసాగర్ 11 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
అర్ధరాత్రి తర్వా 7 ఏడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగా.. 11 గంటల ప్రాంతంలో ఒకవైపు గల 12 వరద గేట్లలోని ఏడు వరద గేట్లను ఎత్తారు. అలాగే మరో వైపు గల 16 వరద గేట్లలోని నాలుగు వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 11 వరద గేట్ల ద్వారా 80వేల క్యూసెక్కుల నీటిని మంజీరలోకి వదలుతున్నట్లు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ (Chief Engineer Srinivas) తెలిపారు. సోమవారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఆయన ఎగువ భాగం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను.. వరద గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోకు (Inflow) అనుగుణంగా నీటి విడుదలను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 1,515 చెరువులు ఉండగా ప్రస్తుతం 600 చెరువులు పొంగిపొర్లుతున్నాయని మిగతా చెరువులు 50 నుంచి 70శాతం వరకు నిండుకుండలా మారాయని ఆయన పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar Project) ఆరేడు శివారులో ఉన్న 20 వరద గేట్లకు ఇటీవల గ్రీసింగ్, ఆయిలింగ్ పనులు కూడా పూర్తి చేశామని స్పష్టం చేశారు. అలాగే మంగళవారం మెకానికల్ బృందం రానున్నారని వారి ఆధ్వర్యంలో 20 వరద గేట్లను కూడా ఆపరేటింగ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Manjira River | మంజీరలో భారీగా పెరిగిన ప్రవాహం
అక్షరటుడే, కోటగిరి: మంజీర నదిలో వరద నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో నది పరీవాహక ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి. పొతంగల్ మండలం (Pothangal Mandal) పరీవాహక ప్రాంతంలో ప్రవాహం ఉధృతంగా సాగుతోంది.
Manjira River | మునిగిన హనుమాన్ ఆలయ ప్రాంతం..
వరద ఉధృతంగా ఉండడంతో మంజీర పరీవాహక ప్రాంతంలో ఉన్న హనుమాన్ ఆలయం (Hanuman Temple) మునిగిపోయింది. గుడి గోపురం మీదుగా వరద ప్రవహిస్తోంది. ఐదు రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని సోమవారం విడుదల చేశారు. దీంతో దిగువన మంజీరనదిలో భారీగా వరద (Heavy Flood) ప్రవహిస్తోంది. కాగా.. మంజీర వంతెనపై నుంచి నీటి ప్రవాహాన్ని ప్రయాణికులు తిలకిస్తున్నారు.
Manjira River | అప్రమత్తంగా అధికారులు..
భారీ వర్షాల నేపథ్యంలో ఎవరూ ఇళ్లలో నుంచి అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోటగిరి తహశీల్దార్ గంగాధర్ పేర్కొన్నారు. పంచాయతీ సిబ్బంది, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంజీర (Manjira River) వైపు వెళ్లొద్దని పేర్కొన్నారు.