అక్షరటుడే, వెబ్‌డెస్క్: Street Dogs | సిమ్లాలో వీధి కుక్కల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటి నుంచి ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్రంగా బాధపడుతున్నారు.
ఈ నేపథ్యంలో వీధి శునకాల నియంత్రణకు సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ (Shimla Municipal Corporation) కొత్త ఆలోచనను అమలులోకి తేనుంది. త్వరలో నగరంలోని వీధి కుక్కల మెడకు క్యూఆర్ కోడ్, జీపీఎస్ ట్యాగ్‌లను అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి కుక్కకు ప్రత్యేక గుర్తింపు నంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్ (QR Code)ను జారీ చేస్తారు. దీంతో వాటి వయస్సు, ఆరోగ్య పరిస్థితి, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ వివరాలు అన్నీ డేటాబేస్‌లో నమోదు చేస్తారు.
Street Dogs | స్మార్ట్ ట్యాగింగ్‌తో శునకాల ట్రాకింగ్
జీపీఎస్(GPS) సహాయంతో శునకాల లొకేషన్ (Dogs Location)ని గుర్తించి, అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా కుక్కల గుంపులు ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. అలానే ప్రజలకు ముప్పుగా మారే పరిస్థితి ఉంటే ముందుగానే చర్యలు తీసుకోవచ్చు. వీధుల్లో తిరిగే శునకాలు చిన్నారులను వెంబడించడం, కరిచే ఘటనలు రోజు రోజుకు పెరిగిపోవడం, కొన్ని తీవ్ర దాడులకు పాల్పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఇటీవలి కాలంలో వీధి కుక్కల (Street Dogs) దాడుల తీవ్రతపై లాన్సెట్ ఇన్‌ఫెక్షస్ డిసీజ్ నివేదిక ఘాటుగా స్పందించింది. దేశంలో జంతువుల దాడుల్లో 75 శాతం కుక్కల ద్వారానే జరుగుతున్నట్లు వెల్లడించింది. దేశంలో నిత్యం ఎంతో మంది చిన్నారులు కుక్కల దాడులకు గురవుతున్నారు. రేబిస్ (Rabis Diseases) లాంటి ప్రాణాంతక వ్యాధులతో సంబంధం ఉన్న ఈ దాడుల వల్ల ఏటా సుమారు 5,700 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. ఇలాంటి ఘటనల నేపథ్యంలో సిమ్లా మున్సిపాలిటీ చేపట్టిన స్మార్ట్ ట్యాగింగ్ చర్యను ఇతర నగరాలూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్య తలెత్తిన తర్వాత ఉరుకులు పరుగులు పెట్టడం కన్నా ముందుగానే పక్కా పద్ధతిలో సమర్థవంతంగా శునకాల నియంత్రణకు చర్యలు తీసుకోవడమే దీర్ఘకాలిక పరిష్కార మార్గం అని పౌరసంఘాలు చెబుతున్నాయి.