అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP)కు భారీగా వరద వస్తోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్ట్ర నుంచి వరద వస్తుండటంతో గోదావరి (Godavari) ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizam Sagar Project) గేట్లు ఎత్తడంతో ఆ నీరు సైతం గోదావరిలో కలుస్తోంది. దీంతో ఎస్సారెస్పీకి భారీ ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా.. ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదలను ప్రారంభించారు.
ఎస్సారెస్పీకి ప్రస్తుతం 1.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1089(73.37టీఎంసీలు) నీరు ఉంది. అధికారులు 9 గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కులు దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
Sriram Sagar | కాలువల ద్వారా..
శ్రీరామ్‌సాగర్ నుంచి కాలువల (Canals) ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌కు భారీగా వరద వస్తుండటంతో వరద కాలువ (Flood Canal) ద్వారా మిడ్‌మానేరుకు నీటిని తరలిస్తున్నారు. వరద కాలువ ద్వారా నీటి విడుదలను ఆదివారం ప్రారంభించారు. మొదట మూడు వేల క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు క్రమంగా 15 వేల క్యూసెక్కులకు పెంచారు. మరోవైపు కాకతీయ ప్రధాన కాలువకు 5వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి
ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు దిగువన గోదావరి నది (Godavari river) పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు, గొర్ల కాపారులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య జనం గోదావరి నది దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో నదిలో చేపట వేటకు వెళ్లొద్దని సూచించారు.
గేట్లు ఎత్తుతున్న అధికారులు