అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GST Reforms | జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆయన దీపావళికి ప్రజలకు పన్నుల భారం తగ్గిస్తామని తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు (State Govts) కూడా సహకరించాలని కోరారు. అయితే మోదీ ప్రకటనతో జీఎస్టీ మార్పులపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు చేయనున్నట్లు తెలిసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) 2017 జులై 1 నుంచి జీఎస్టీని అమలులోకి తెచ్చింది. ఒకే దేశం ఒకే పన్ను అని దీనిని అమలు చేశారు. ప్రస్తుతం జీఎస్టీలో 5శాతం, 12, 18, 28శాతం పన్ను శ్లాబులు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో మార్పులు చేయనున్నట్లు తెలిసింది. 5 శాతం, 18, 40శాతం శ్లాబులు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
GST Reforms | వాటిపై 40శాతం జీఎస్టీ
ప్రజలకు అత్యవసరం అయిన వస్తువులపై జీఎస్టీని తొలగించడం లేదా 5 శాతం శ్లాబ్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువులను (Electronic goods) 18శాతం స్లాబ్‌లో పెట్టనున్నారు. అలాగే విలాసవంతమైన వస్తువులు, పొగాకు, మద్యం, జూదంపై (Sin Goods) 40శాతం పన్ను విధించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటిపై 28శాతం పన్ను వేస్తున్నారు. కొత్త శ్లాబుల్లో వీటిపై పన్ను పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే 12శాతం పన్ను పరిధిలో ఉన్న చాలా వస్తువులను 5శాతం స్లాబ్‌లోకి తేనున్నారు.
GST Reforms | వీటి ధరలు తగ్గుతాయి
జీఎస్టీలో 12శాతం స్లాబ్ ఎత్తేయనున్నారు. దీంతో దీని పరిధిలో ఉన్న వస్తువులు 5శాతంలోకి తీసుకు వస్తారు. విద్య, సైకిళ్లు, నిత్యవసర సామగ్రి ధరలు తగ్గనున్నాయి. కొత్త స్లాబ్‌లు అమలులోకి వస్తే టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్ల ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. వీటిపై ప్రస్తుతం 28శాతం జీఎస్టీ ఉండగా.. 18శాతం పరిధిలోకి తేనున్నారు. టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రానిక్ వాహన రంగాలకు ప్రయోజనం లభించనున్నట్లు సమాచారం. టూత్‌పేస్టులు, సబ్బులు, నూనె, ఫోన్లు, కంప్యూటర్లు తదితర వస్తువులు ప్రస్తుతం 12శాతం స్లాబ్‌లో ఉన్నాయి. వీటి 5శాతం పన్ను పరిధిలోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.