అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Congress | పీసీసీ క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee) ఆదివారం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఛైర్మన్ మల్లు రవి (Mallu Ravi) అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కొంతకాలంగా సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Raja Gopal Reddy) విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ వ్యవహారంపై చర్చించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. అయితే ఆదివారం సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి అంశంపై చాలా సేపు చర్చించినట్లు మల్లు రవి తెలిపారు. సమస్య పునరావృతం కాకుండా ఒకసారి చెప్పి చూస్తామని.. అయినా వినకుంటే ఆయనపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Congress | కమిటీల ఏర్పాటు
వరంగల్ కాంగ్రెస్‌లో కొంతకాలంగా వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళికి (Konda Murali) మిగతా ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఈ క్రమంలో ఇటీవల మురళితో క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. తాజాగా వరంగల్ జిల్లా నేతల సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై పీసీసీ లేఖ రాసినట్లు మల్లు రవి తెలిపారు. అలాగే ఇటీవల గజ్వేల్‌లో మంత్రి వివేక్ పాల్గొన్న కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు దాడులు చేసుకున్నారు. గజ్వేల్‌లో నర్సారెడ్డి దాడి చేశారని ఫిర్యాదు వచ్చిందని మల్లు రవి తెలిపారు. ఈ విషయం గురించి నలుగురితో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఛైర్మన్‌గా శ్యామ్ మోహన్‌ను నియమించామని, ఈ కమిటీ పది రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు.
Congress | వచ్చే వారం సమావేశం
వరంగల్‌లో (Warangal) రెండు వర్గాల నాయకులతో కమిటీ చర్చించనున్నట్లు మల్లు రవి తెలిపారు. గజ్వేల్ (Gajwel) అంశంపై సైతం నివేదిక వచ్చాక వచ్చే వారం మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వాటిపై వచ్చే సమావేశంలో చర్చిస్తామన్నారు. తనది మంటలు ఆర్పే పని అని, మంటలు పెట్టే పని కాదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌లో విభేదాలు సరి చేస్తూ, అందరూ కలిసి పని చేసేలా చూస్తానన్నారు. ఎంత చెప్పినా వినకుంటే వేటు తప్పదని మల్లు రవి హెచ్చరించారు. మంత్రి పదవి విషయంలో రాజోపాల్ రెడ్డి పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. దీనిపైన వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు వచ్చాక వచ్చేవారం ఆయన వ్యవహారంపై చర్చిస్తామన్నారు.