అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) బీజేపీపై విమర్శలు ఆపడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావును (Ramchandra Rao) ఎన్నుకోవడంతో రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంత మంది నాయకుల తీరుతో బీజేపీ అధికారంలోకి రాదని ఆయన చెప్పారు.
కొంత మంది పెద్ద నాయకుల తీరుతో బీజేపీకి నష్టం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో తన మనుషులకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. దీంతో ఏళ్లుగా బీజేపీ (BJP) కోసం కష్టపడ్డ వారికి పదవులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు.
Raja Singh | అధిష్టానం దృష్టి పెట్టడం లేదు
బీజేపీ అధిష్టానం (BJP high command) తెలంగాణపై దృష్టి పెట్టడం లేదని రాజాసింగ్ అన్నారు. వాళ్లు వేరే రాష్ట్రాలపై ఫోకస్ పెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని కొంతమంది పెద్ద నాయకులు ఏది చెబితే కేంద్ర నాయకత్వం అదే నమ్ముతుందన్నారు. వారితోనే తెలంగాణలో (Telangana) బీజేపీకి నష్టం జరుగుతుందని తెలిపారు. ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Raja Singh | రాజకీయాలు తెలియదు
తాను ఎమ్మెల్యేగా ఉన్నా.. రాజకీయాలు (Politics) తెలియదని రాజాసింగ్ అన్నారు. నచ్చింది చేయడమే తనకు తెలుసన్నారు. రాజకీయం నేర్చుకోలేదని చెప్పారు. కొందరు నాయకులు తనపై కోపంగా ఉన్నారన్నారు. వారు కేంద్రంతో చెప్పి తన రాజీనామాను ఆమోదింపజేశారని అన్నారు. వారి పేరు తాను చెప్పదలుచుకోలేదన్నారు. అయితే వారితోనే పార్టీకి నష్టం జరుగుతుందన్నారు.
ఇటీవల బీజేపీలో చేరికలపై సైతం రాజాసింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కొత్తగా బీజేపీలో చేరే వారు గతంలో పార్టీని వీడిన వారితో మాట్లాడాలని ఆయన సూచించారు. బీజేపీలో చేరితే అనుచరులకు పదవులు కూడా ఇప్పించుకోలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసినా.. పార్టీపై విమర్శను మాత్రం ఆయన ఆపడం లేదు. మరోవైపు తనకు బీజేపీ తప్ప మరో పార్టీ సెట్ అవ్వదని చెబుతున్నారు. వేరే పార్టీలో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు.