అక్షరటుడే, వెబ్‌డెస్క్: GST | జీఎస్టీ విధానంలో త్వరలో తీసుకురానున్న సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ప్రధాని మోదీ (PM Modi) కోరారు. ప్రతిపాదిత సంస్కరణలను అమలు చేయడంలో సహకరించాలని రాష్ట్రాలకు సూచించారు. ఇవి అమలులోకి వస్తే దేశ ప్రజలకు రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే (Express Way), అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II ఢిల్లీ విభాగాన్ని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ దీపావళికి దేశ ప్రజలు GST సంస్కరణ నుంచి డబుల్ బోనస్‌ను (double bonus) పొందబోనున్నారు. GSTని సులభతరం చేయడం, పన్ను రేట్లను సవరించడానికి ప్రయత్నం చేస్తున్నాం.. ఇది ప్రతి కుటుంబానికి, పేద, మధ్యతరగతికి, ప్రతి చిన్న, పెద్ద వ్యాపారికి చేకూరుస్తుంది” అని ఆయన తెలిపారు.
GST | అభివృద్ధి బాటలో ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) సంపూర్ణ అభివృద్ధితో కూడిన సంపన్న రాజధానిగా మార్చేందుకు బీజేపీ కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రాల మధ్య శతృత్వం పెంచడానికి ప్రయత్నాలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీని (AAM Admi Party) ఉద్దేశించి ఆయన విమర్శించారు. ఢిల్లీ అభివృద్ధిని విస్మరించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీని పరోక్షంగా విమర్శించారు. అయితే రాజధానిని సంపన్నంగా మార్చడానికి బీజేపీ తన వంతు కృషి చేస్తోందని నొక్కి చెప్పారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో (Uttar Pradesh) బీజేపీ మొదటిసారిగా అధికారంలో ఉందనే విషయాన్ని కూడా ప్రధాని తన ప్రసంగంలో హైలైట్ చేశారు.
GST | రాష్ట్రాల మధ్య శతృత్వం పెంచే కుట్ర
హర్యానాలో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పార్టీ ఆప్ ఢిల్లీ ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందని, రాజధానిలోకి ప్రవహిస్తున్న యమునా నది నీటిని ‘విషం’ చేస్తోందని మోదీ విమర్శించారు. “వారు (ప్రతిపక్షాలు) ప్రజల విశ్వాసం కోల్పోయారు. వాస్తవాల నుంచి పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు.
కొన్ని నెలల క్రితం ఢిల్లీ, హర్యానా ప్రజల (Delhi – Haryana People) మధ్య శత్రుత్వాన్ని సృష్టించడానికి, ఒకరిపై ఒకరు పోటీ పడేలా ప్రయత్నాలు చేశారు. హర్యానా ప్రజలు ఢిల్లీ నీటిని విషపూరితం చేస్తున్నారని కూడా ఆరోపించారు. కానీ.. ఇప్పుడు, ఢిల్లీ సహా మొత్తం NCR అటువంటి ప్రతికూల రాజకీయాల నుండి విముక్తి పొందింది” అని మోదీ పేర్కొన్నారు.
GST | ఢిల్లీని నాశనం..
కాంగ్రెస్ (Congress), ఆప్ ప్రభుత్వాలు దేశ రాజధానిని అభివృద్ధి చేయకపోగా నాశనం చేశాయని ప్రధాని విమర్శించారు. “చాలా కాలంగా మనం ఢిల్లీలో అధికారంలో లేము మునుపటి ప్రభుత్వాలు ఢిల్లీని ఎలా నాశనం చేశాయో మనం చూశాం. గత ప్రభుత్వాలు పెట్టి పోయిన సమస్యల నుంచి ఢిల్లీని బయటకు తీసుకురావడానికి కొత్త బీజేపీ ప్రభుత్వానికి ఎంత కష్టమో నాకు తెలుసు” అని ఆయన అన్నారు.
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II ఢిల్లీ-NCR ప్రాంతంలో రద్దీని తగ్గించడం ద్వారా ప్రజలకు సహాయపడుతుందన్నారు. తమ ప్రభుత్వం దేశంలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినందని, గత 11 సంవత్సరాలలో దేశమంతటా రికార్డు స్థాయిలో రోడ్ల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. UER-II ను అభివృద్ధి చేయడానికి టన్నుల కొద్దీ చెత్తను కూడా ఉపయోగించారన్నారు. “చెత్త పర్వతాలను తగ్గించడం ద్వారా, వ్యర్థ పదార్థాలను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించారు. ఇది శాస్త్రీయ పద్ధతిలో జరిగింది” అని ఆయన వెల్లడించారు.