అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KC Venugopal | కేంద్ర ఎన్నికల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్ పార్టీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. సిగ్గులేకుండా అన్ని హద్దులను దాటి వ్యవహరిస్తోందని విమర్శించింది. భారీగా ఓట్ల చోరీకి పాల్పడుతూ రాజ్యాంగ బాధ్యతను నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించింది. ఓట్ల చోరీపై (Vote Chori) కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు చేసిన ఆరోపణలపై ఈసీ శనివారం స్పందించింది. ఓటర్ల జాబితాల (Voter List) రూపకల్పనలో పార్టీలకు కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేసింది. ఓటర్ల జాబితా రూపకల్పనలో అనుసరించే ప్రక్రియను పేర్కొంటూ పది అంశాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేసింది.
KC Venugopal | జాబితాలు ఎందుకివ్వరు?
ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను తయారు చేయడంలో “అత్యంత పారదర్శకత” ఉందని చెప్పుకుంటున్నప్పటికీ, దాని చర్యలు దానికి భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఓటర్ల జాబితాలు ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారో, ఎన్నికలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను 45 రోజుల్లోపు ఎందుకు తొలగిస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
“ఎన్నికల జాబితాల పరిశీలనను ECI నిజంగా స్వాగతిస్తే, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లు మేం అడుగుతున్న జాబితాలను ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? అలాగే కీలకమైన సీసీటీవీ ఆధారాలను ఎందుకు తొలగిస్తున్నాస్తారో స్పష్టంగా చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో వైఫల్యాలను కప్పిపుచ్చడానికి అస్పష్టంగా రూపొందించిన ప్రెస్ నోట్స్ వెనుక దాక్కోకూడదు” అని వేణుగోపాల్ ‘X’లో విమర్శించారు. బీహార్(Bihar)లో 65 లక్షలకు పైగా ఓటరల్ తొలగింపుపై వివరణ ఇవ్వడానికి నిరాకరించడం, గతంలో అప్‌లోడ్ చేసిన ఓటర్ జాబితాల పీడీఎఫ్‌లను నిశ్శబ్దంగా తొలగించడం వంటివి ఎందుకు చేశారని ప్రశ్నించారు.