అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రద్దీ మాములుగా ఉండదు. వాహనాల రద్దీతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.11 వేల కోట్లతో రెండు హైవేలను నిర్మించింది. ఆ రహదారులను ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ సీఎం రేఖగుప్తా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని పాల్గొన్నారు.
ఢిల్లీలో ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి, మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఈ హైవేలను కేంద్రం నిర్మించింది. అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (Urban Extension Road-II), ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ఆయన జాతికి అంకితం ఇచ్చారు. ఢిల్లీలోని రోహిణిలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే అయిన అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ 75 కిలోమీటర్ల మేర నిర్మించారు. జాతీయ రహదారి 44 నుంచి రోహిణి, ముండ్కా, నజాఫ్‌గఢ్, ద్వారక మీదుగా వెళ్తూ.. NH-48లోని ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే వరకు దీనిని నిర్మించారు. రూ. 5,580 కోట్లతో నిర్మించిన ఈ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్లపై ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది.
PM Modi | ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే
ప్రధాని ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే (Dwarka Expressway)ను కూడా ప్రారంభించారు. రూ.5,360 కోట్లతో 10.1 కిలోమీటర్ల మేర దీనిని నిర్మించారు. ఈ హైవేతో ఇక 20 నిమిషాల్లోనే నోయిడా నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ఢిల్లీ రింగ్ రోడ్డుపై రద్దీని ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే తగ్గిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ రెండు రహదారులతో ప్రయాణం మరింత సులభతరం అవుతుందన్నారు. ఢిల్లీ అభివృద్ధికి హైవేలు దోహదపడుతాయని పేర్కొన్నారు.