అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) తన సినీ జీవితంలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) తనదైన శైలిలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేసి, రజనీకాంత్ సినిమాటిక్ జర్నీ ఎంతో గౌరవంతో సాగిన మార్గాన్ని కొనియాడారు.“తరాలు మారినా రజనీకి ఆదరణ మాత్రం అసలు తగ్గలేదు. ఆయన నటన, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నింటిలో ప్రత్యేకత ఉంది. వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజనీ’ అనే టైటిల్ వేయగానే థియేటర్లలో అభిమానుల ఉత్సాహం ఎలా ఉప్పొంగుతుందో నేను చెన్నైలో (Chennai) అనేకసార్లు చూశాను,” అని పవన్ గుర్తు చేశారు.
Rajinikanth | రజనీ కృతజ్ఞతలు..
అదేవిధంగా, విలన్ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన రజనీకాంత్, కథానాయకుడిగా మారి అసాధారణమైన ఇమేజ్‌ను సంపాదించారని పవన్ ప్రశంసించారు. “అభినయానికి ఆయన పెట్టింది పేరు. నడక, సంభాషణ, హావభావాలు అన్నింటిలో ఆయనకే ఓ ప్రత్యేక శైలి ఉంది,” అని వివరించారు. రజనీకాంత్‌కి యావత్ భారతదేశం నుంచి ఉన్న అభిమానాన్ని గుర్తు చేస్తూ, ఆయన ఆధ్యాత్మికతపై కూడా పవన్ ప్రశంసలు కురిపించారు. “మహావతార్ బాబాజీ భక్తుడిగా, యోగా సాధకుడిగా ఉన్న రజనీ గారు భక్తి, ధార్మికత పరంగా కూడా ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు,” అని తెలిపారు.అంతేకాదు, రాబోయే కాలంలో రజనీకాంత్ మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన పవన్ (Pawan Kalyan), ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గాను పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకి తాజాగా రజనీకాంత్ స్పందించారు. ఆయన తన ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ రాజకీయ తుపాను అంటూ కొనియాడడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నా సోదరుడు, రాజకీయ తుపాను పవన్ కళ్యాణ్‌కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తలైవా ట్వీట్ (Tweet) చేశారు.