అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anita Bose | భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subash chandrabose) అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె డా.అనితా బోస్ ప్ఫాఫ్ (Anita Bose pfaff) మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా చేసిన అభ్యర్థనను మరోసారి పునరుద్ఘాటిస్తూ, ఆగస్టు 18న ఆయన 80వ వర్ధంతి సందర్భంగా ఈ విజ్ఞప్తి చేశారు. నేతాజీకి భారత్‌పై, దేశ ప్రజలపై ఎంత ప్రేమ ఉందో… దేశ ప్రజలకు కూడా ఆయనపై అంతే గౌరవం ఉందని అనితా బోస్ అన్నారు. “నా తండ్రి అంతిమావశేషాలు స్వదేశానికి తిరిగి వస్తే చూడడం నా జీవితంలో ఓ ముఖ్యమైన కోరిక,” అని ఆమె పేర్కొన్నారు. ప్రజలు కూడా ఈ అభ్యర్థనకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.
Anita Bose | కేంద్రానికి విన్నపం..
1945 ఆగస్టు 18న, జపాన్‌కి (Japan) చెందిన తైహోకు (ప్రస్తుత తైవాన్ తైపీ) వద్ద విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారన్నది అందరికి తెలిసిన విషయం. కానీ ఆయన మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు, వాదనలు ఉన్నాయి. విమాన ప్రమాదం అనంతరం తైపీలో నేతాజీ అంత్యక్రియలు జరిగాయని, అనంతరం ఆయన అస్థికలను టోక్యోలోని రెంకో-జీ ఆలయంలో భద్రపరిచినట్లు సమాచారం. టోక్యోలోని రెంకో-జీ ఆలయంలో నేతాజీ అస్థికలు ఇప్పటికీ ఉన్నాయని, అక్కడి పూజారులు గౌరవంగా సంరక్షిస్తున్నారని సమాచారం. భారతీయ సమాజ అభ్యర్థనపై ఆలయం వారు అప్పట్లో అవశేషాలను స్వీకరించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అవి అక్కడే ఉంచబడ్డాయి.
ఈ నెల చివర్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) జపాన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనితా బోస్ ప్ఫాఫ్ నుంచి ఈ అభ్యర్థన మరోసారి రావడం ప్రత్యేక ఆసక్తికి దారితీస్తోంది. నేతాజీ కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి కోల్‌కతాలోని బోస్ కుటుంబం, కూడా ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని అవశేషాలను తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు.నేతాజీ అభిమానులు, దేశ ప్రజలు ఈ విషయంలో కేంద్రం త్వరిత నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు. మరి ఈ వర్థంతి నాటికి కేంద్రం ఏదైనా ప్రకటన చేస్తుందా? ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో ఈ అంశం ప్రస్తావనకు వస్తుందా? అన్నది చూడాలి.