అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని (Srivaru) నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో భక్తుల కోసం టీటీడీ పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ (TTD) ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది.
Tirumala | ఆలయ పవిత్రత కోసం..
ఆలయంలో భక్తులు, సిబ్బంది తీరుతో తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Tirumala | మూడు రోజుల పాటు..
ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 5న పవిత్ర ప్రతిష్ఠ, 6న పవిత్ర సమర్పణ, 7న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనడానికి ఒక రోజు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఉత్సవాల్లో పాల్గొన్న వారికి 2 లడ్డూలు, 2 వడలు అందజేస్తారు.
పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 4న అంకురార్పణ సందర్భంగా తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, 5న అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజ సేవలను రద్దు చేశారు. సెప్టెంబరు 5, 6, 7వ తేదీల్లో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్ సేవను టీటీడీ అధికారులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.