అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి శనివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. శనివారం రోజంతా వర్షం పడుతూనే ఉంది. ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
రాష్ట్రంలో రానున్న 24 గంటలు అతి భారీ వర్షాలు పడతాయి. ఆదివారం సాయంత్రం, రాత్రి పూట కుండపోత వాన కురిసే ఛాన్స్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, భువనగిరి, వికారాబాద్, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నగరంలో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడుతాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Weather Updates | ప్రాజెక్ట్‌లకు జలకళ
నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్ (Project)లకు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే కృష్ణనదిపై గల ప్రాజెక్ట్‌లు నిండగా.. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. మరోవైపు గోదావరిపై గల శ్రీరామ్ సాగర్ (Sriram Sagar) ప్రాజెక్ట్‌కు భారీగా వరద వస్తోంది. వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో ప్రాజెక్ట్ నిండనుంది. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ (Flood Canal) ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. మిడ్ మానేర్, లోయర్ మానేరు సైతం జలకళను సంతరించుకున్నాయి. మంజీరపై గల సింగూరు (Singuru) డ్యామ్‌కు వరద కొనసాగుతుండడంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నిజాంసాగర్ (Nizam Sagar)కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.