అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS | సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం.. పదేళ్ల పాలన అనుభవం.. బీఆర్ఎస్ పార్టీ (BRS) సొంతం. తెలుగు రాష్ట్రాల చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక పేజీలు లిఖించుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు అభాసుపాలవుతోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి అనవసర ప్రేలాపనలు, పిచ్చి ఆరోపణలతో ప్రజల్లో పలుచన అవుతోంది. ఎన్నికల్లో ఓటమిని, ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికీ అంగీకరించని ఆ పార్టీ నాయకత్వం ఇంకా జనాల్నే తప్పు బడుతోంది. గద్దె దిగి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఉద్యమ పార్టీ ఇప్పటికీ వాస్తవాలను అంగీకరించడం లేదు. ప్రజల కోణంలో, ప్రజా సమస్యలపై పోరాడడం లేదు. అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. పైగా ప్రభుత్వంపై విరుచుకుపడే క్రమంలో చేస్తున్న ఆరోపణలు బూమరాంగ్ అవుతున్నాయి. ఆ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలే అందుకు తాజా ఉదాహరణ.
BRS | బాంబులతో పేల్చేశారంట..!
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen kumar) శనివారం సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఈ కుట్రకు పాల్పడ్డాయని, దీనిపై ప్రత్యేకంగా విచారణ జరిపించాలన్నారు. మట్టి, ఇసుక కుంగడం వల్ల స్తంభాలకు పగుళ్లు రావని, జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు వాడితేనే ఇలాంటివి జరుగుతాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారని తెలిపారు. సీనియర్ ఐపీఎస్‌గా ఎంతో అనుభవం ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో కలకలం రేపింది.
BRS | ఇవేం కూతలు..
బాంబులు పెట్టి మేడిగడ్డ ప్రాజెక్టును (Medigadda Project) పేల్చేశారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ, మేధావి వర్గాలతో పాటు జనంలోనూ చర్చ జరుగుతోంది. రాజకీయ లబ్ధి కోసం ప్రపంచంలో ఎక్కడైనా ఇలా ప్రాజెక్టులను పేల్చేస్తారా? అన్న చర్చ మొదలైంది. దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోయిన బీఆర్ఎస్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లయింది. ఇప్పటికే కొందరు గులాబీ నేతల తీరును చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారు. అధికారం పోయినా అహంకారం తగ్గించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సిన ఆయన ఫామ్ హౌస్‌కే పరిమితం కావడం జనాలకు నచ్చడం లేదు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే ప్రజలకు ఇప్పటికీ ఎంతో కొంత అభిమానం ఉంది. కానీ, కొందరు నేతల వ్యవహార శైలి కారణంగా గులాబీ పార్టీ జనాలకు దూరమవుతోంది.
సొంత ఇంట్లో నెలకొన్న ఆధిపత్య పోరును కట్టడం చేయడంలో విఫలం కావడం, ఆడబిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారన్న ప్రచారం కేసీఆర్ ప్రాభవానికి గండి కొడుతోంది. కవిత ఎపిసోడ్ ఊహించిన దాని కంటే ఎక్కువ నష్టం చేకూర్చుతోంది. లేఖతో తలెత్తిన సంక్షోభం తర్వాత రెండుసార్లు ఫామ్ హౌస్‌కు వచ్చినప్పటికీ కవితతో మాట్లాడకుండా కేసీఆర్ దూరం పెట్టడం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది.
దానికి తోడు గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై కొనసాగుతున్న విచారణలు, ఈ క్రమంలో బయటకు వస్తున్న సంచలన విషయాలు ఉద్యమ పార్టీని చిక్కుల్లో పడేస్తున్నాయి. ఇదే క్రమంలో ఆ పార్ట ఈ నేతలు చేస్తున్న పిచ్చి ఆరోపణలు, తప్పుడు కూతలు బీఆర్ఎస్ ను దెబ్బ తీస్తున్నాయి. మరోవైపు, బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారంపై స్పష్టత ఇవ్వకపోవడం తప్పుడు సంకేతాలు ఇస్తోంది. ఉద్యమ సమయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోని స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. ప్రస్తుత సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారన్నది కాలమే చెబుతుంది.