అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | సులువుగా డబ్బు సంపాదించేందుకు పలువురు మోసాల బాట పడుతున్నారు. మాయమాటలతో ఇతరులను నమ్మించి డబ్బులతో పరారవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు (Profits) వస్తాయని ఆశ చూపి ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇటీవల ఇలాంటి మోసాలు పెరిగాయి.
క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ముంబయికి చెందిన హిమాన్షు సింగ్ క్రిప్టో కరెన్సీ (Cryptocurrency) పేరిట ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ప్రజల నుంచి రూ.300 కోట్లు కాజేయగా.. ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఇలాంటిదే మరో మోసం వెలుగులోకి వచ్చింది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి ఓ వ్యక్తి ఏకంగా రూ.20 కోట్లు కాజేశాడు.
Hyderabad | స్టాక్ మార్కెట్ పేరిట..
మల్కాజిగిరికి (Malkajgiri) చెందిన దినేష్ పాణ్యం స్టాక్ మార్కెట్ (Stock Market)లో పెట్టుబడులు పెడతానని ప్రజలను నమ్మించాడు. తనకు డబ్బులు ఇస్తే బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తానని హామీ ఇచ్చాడు. వృద్ధులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా దందాకు తెర లేపాడు. మల్కాజ్గిరిలో ఒక ఆఫీస్ కూడా పెట్టాడు. దీంతో ఆయన దగ్గర 170 మంది సుమారు రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ప్రతినెలా వడ్డీ జమ చేస్తానని చెప్పడంతో నమ్మారు. కొన్ని నెలలు వడ్డీ చెల్లించిన దినేశ్ ఆ తర్వాత వడ్డీ జమ చేయడం ఆపేశాడు. దీంతో పలువురు బాధితులు ఆయనను నిలదీద్దామని ఆఫీస్కు వెళ్లగా.. అప్పటికే బోర్డు తిప్పేసి పరారయ్యాడు.
Hyderabad | విడాకులకు అప్లయ్ చేశా..
దినేష్ చేతిలో మోసపోయిన బాధితులు ఆయన భార్య కవిత వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో తనకేం సంబంధం లేదని ఆమె చేతులు ఎత్తేసింది. అంతేగాకుండా భర్తతో రెండు రోజుల క్రితమే విడిపోయాను అని చెప్పింది. విడాకుల కోసం కూడా అప్లయ్ చేశానని చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తాము మోసపోయామని తెలుసుకొని కుషాయిగూడ (Kushaiguda) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.