అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా సొంత పార్టీ నేతలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన విషయం చర్చించడానికి ఆదివారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ (PCC Disciplinary Committee) సమావేశం కానుంది. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) రానున్నాయి. కాగా.. వర్గపోరు, వ్యతిరేక వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వరంగల్ కాంగ్రెస్‌లో పంచాయితీపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్చించి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టింది. అయితే కొంతకాలంగా వరుస విమర్శలు చేస్తున్న రాజగోపాల్‌రెడ్డిపై అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో ఆయన వ్యాఖ్యలపై నేడు చర్చించనున్నారు.
Rajagopal Reddy | మంత్రి పదవి దక్కకపోవడంతో..
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి (Minister Post) ఆశించారు. మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం ఆయనకు మొండిచేయి చూపింది. మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతోనే తాను కాంగ్రెస్‌లో చేరానని ఆయన పలుమార్లు చెప్పారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు పదవి రాలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు.
Rajagopal Reddy | సీఎం లక్ష్యంగా..
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని పెద్దలు భావిస్తున్నారు. సీఎం భాష మార్చుకోవాలని గతంలో మునుగోడు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని రెండు రోజుల క్రితం ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘పదవులు మీకే.. పైసలు మీకేనా’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మంత్రి దగ్గరకు వెళ్లి అడిగినా నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ‘పదవులు మీరే తీసుకోండి.. కనీసం అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి’ అని ఆయన కోరారు.
Rajagopal Reddy | పీసీసీ చీఫ్ ఆదేశం
రాజగోపాల్‌రెడ్డి తీరు పార్టీ నష్టం జరుగుతుందని భావించిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) స్పందించారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలించాలని క్రమ శిక్షణ కమిటీకి ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లురవితో ఫోన్లో మాట్లాడరు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. గజ్వేల్ కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరుపై సైతం ఈ మీటింగ్‌లో చర్చించనున్నట్లు తెలిసింది. ఇటీవల మంత్రి వివేక్ సమక్షంలో గజ్వేల్‌లో రెండు వర్గాల నాయకులు వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీసీసీ క్రమ శిక్షణ కమిటీ ఆయా అంశాలపై చర్చించనుంది. మరి రాజగోపాల్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.