అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్‌సాగర్ (SRSP)కు వరద పోటెత్తింది. మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం (Heavy Rains) దంచికొడుతోంది. దీంతో ఎస్సారెస్పీకి వరద వస్తోంది. శనివారం ఉదయం 6 గంటలకు 56,428 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 9గంటలకు 89,466 క్యూసెక్కులకు పెరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు 1,04,879 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. ఆదివారం ఉదయానికి 1.51 లక్షలకు పెరిగింది.
Sriram Sagar | 24 గంటల్లో పది టీఎంసీలు
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1085.3 (60.825 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. 24 గంటల వ్యవధిలో ప్రాజెక్ట్‌లోకి 10 టీఎంసీల నీరు చేరడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి ఎస్సారెస్పీలో 48.295 టీఎంసీల నీరు ఉంది.
ప్రస్తుతం ప్రాజెక్ట్ నిండాలంటే.. మరో 20 టీఎంసీల నీరు అవసరం. ఎగువ నుంచి వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో జలాశయం నిండుకుండలా మారే అవకాశం ఉంది. మరోవైపు నిజాంసాగర్ (Nizam Sagar)కు కూడా ప్రవాహం వస్తోంది. ఆ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితే శ్రీరామ్ సాగర్‌కు ఇన్‌ఫ్లో మరింత పెరగనుంది. ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వస్తుండటంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలకు ఢోఖా ఉండదని పేర్కొంటున్నారు
Sriram Sagar | కాలువల ద్వారా నీటి విడుదల
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ (Kakatiya Main Canal) ద్వారా 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, అలీ సాగర్ ఎత్తి పోతలకు 180 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 594 క్యూసెక్కులు పోతుందని ఏఈఈ కొత్త రవి తెలిపారు. ప్రాజెక్ట్‌కు భారీగా వరద వస్తుండటంతో దిగువన గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని, పశువుల కాపరులు, రైతులు నదివైపు వెళ్లొద్దని కోరారు.