అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | బీహార్‌లో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) జరగనున్నాయి. దీంతో ఎలాగైనా అధికారం కాపాడుకోవాలని ఎన్డీఏ (NDA) కూటమి ప్రయత్నిస్తుండగా.. తాము గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా (INDIA) కూటమి భావిస్తోంది.
ఎన్నికలను రెండు కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే బీహార్ ఓటర్ జాబితా సవరణ (SIR)పై ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి బీహార్‌లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra) చేపట్టనున్నారు. మొత్తం 1,300 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహాసభతో యాత్ర ముగుస్తుంది.
Rahul Gandhi | 16 రోజుల పాటు
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకలను ఎత్తిచూపే లక్ష్యంతో రాహుల్ గాంధీ 16 రోజుల పాటు యాత్ర చేపట్టనున్నారు. ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్, ఇండియా కూటమికి చెందిన ఇతర నాయకులు సైతం దీనిలో పాల్గొనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ద్వారా ఓటర్ల ఓటు హక్కును కోల్పోతున్నారని రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
ఓటరు అవగాహన ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ (Congress) ఈ యాత్ర చేపడుతోంది. బీహార్‌లో 2015 నవంబర్ నుంచి నితీశ్‌కుమార్ సీఎంగా కొనసాగుతున్నారు. గతంలో ఎన్డీఏలో కొనసాగిన ఆయన తర్వాత కొంతకాలం ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకున్నారు. మళ్లీ బీజేపీతో జత కట్టి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Rahul Gandhi | 20 శాతం మంది ఓటు హక్కు కోల్పోతారు
కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుత రోల్ రివిజన్ కింద బీహార్ ఓటర్లలో 20 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరగకుండా.. రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుందని ఆయన విమర్శించారు. ప్రజలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనాలని కోరారు. ఈ యాత్ర ఔరంగాబాద్, గయ, నలంద, భాగల్పూర్, పూర్నియా, దర్భంగా, చంపారన్ వంటి జిల్లాల మీదుగా సాగుతోంది.