అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Floods | నాలుగైదు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. నదులకు వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చాయి. ప్రాజెక్ట్ (Project)లకు భారీగా వరద వస్తోంది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు, తోడు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో కృష్ణమ్మ (Krishna River) పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే నదిపై గల జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లు నిండాయి. దీంతో ఎగువన నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. అన్ని ప్రాజెక్ట్‌ల్లోని జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ల నుంచి నీటి వదులుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) 14 గేట్లు ఎత్తడంతో చూడటానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.
Heavy Floods | మంజీర ఉగ్రరూపం
గత కొంతకాలంగా వరద లేక బోసిపోయిన మంజీర నది ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చింది. నదిపై గల సింగూరు (Singuru) జలాశయానికి 20,136 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. మూడు గేట్లు ఎత్తి 22,138 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నీరు మెదక్ (Medak) జిల్లాలోని ఘనపురం ఆనకట్ట మీదుగా నిజాంసాగర్‌లోకి వెళ్తోంది. సింగూరు నుంచి భారీగా వరద వస్తుండటంతో పాపన్నపేట మండలంలోని ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఏడుపాయల ఆలయం (Edupayala Temple) వద్ద మంజీర ఉధృతంగా పారుతుండటంతో అధికారులు ఆలయాన్ని మూసి వేశారు. మూడు రోజులుగా వనదుర్గా మాత ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో పూజలు చేస్తున్నారు.
Heavy Floods | నిజాంసాగర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో
కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project) పొంగి పొర్లుతోంది. ఆ నీరు మంజీర ద్వారా నిజాంసాగర్లోక్ వెళ్తున్నాయి. సింగూరు నుంచి సైతం నీటి విడుదల కొనసాగుతుండటంతో నిజాంసాగర్ (Nizam Sagar) ప్రాజెక్ట్‌కు ఇన్‌ప్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలోకి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. సాయంత్రం వరకు భారీగా పెరిగే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ (Sriram Sagar)కు సైతం భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్‌లోకి 89 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. నీటిమట్టం 51 టీఎంసీలకు చేరింది.
Heavy Floods | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడటంతో వాగులు, నదులు ఉప్పొంగి పారుతున్నాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌కు 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాత్నాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది.
గేట్లు ఎత్తడంతో తర్ణం వాగులోకి వరద చేరింది. తాత్కాలిక వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఆదిలాబాద్-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో పలు కాలనీలు జలమయం అయ్యాయి.
Heavy Floods | జంట జలాశయాలకు జలకళ
హైదరాబాద్ (Hyderabad) ప్రజలకు తాగు నీరు అందించే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్‌కు వరద కొనసాగుతోంది. హిమాయత్‌సాగర్ 4 గేట్లు ఎత్తి 3,854 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌కు 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నిండుకుండలా మారింది.
Edupayala temple today @XpressHyderabad pic.twitter.com/69GnrwUVpS
— V.V. Balakrishna-TNIE (@balaexpressTNIE) August 16, 2025