అక్షరటుడే, ఆర్మూర్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కాగా.. శ్రీరాంసాగర్కు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రసుత్తం ప్రాజెక్టులోకి 89,466 క్యూసెక్కుల వరద వస్తోంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1082.30 అడుగులకు (51.659 టీఎంసీలు) చేరింది. భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి శనివారం 6 గంటలకు 56,428 క్యూసెక్యుల వరద రాగా.. 9 గంటల వరకు 89,466 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయంలో గతేడాది ఇదే సమయానికి 1081.10 అడుగుల (48.071 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
Sriramsagar project | కాలువ ద్వారా నీటి విడుదల..
ప్రాజెక్టు కాల్వల ద్వారా పంటల సాగుకోసం అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 500 క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోతలకు 180 క్యూసెక్యుల నీటిని వదులుతున్నారు. 541 క్యూసెక్యూల నీరు ఆవిరి రూపంలో పోతుందని ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి తెలిపారు.