అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | హిందూ సమాజాన్ని చీల్చేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఆరోపించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని యూసుఫ్‌గూడలో శుక్రవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు (Ramachandra Rao)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్వాడీ గో బ్యాక్ నినాదం వెనుక కుట్ర ఉందన్నారు. కాగా సోషల్ మీడియాలో ఇటీవల మార్వాడీ గో బ్యాక్ అంటూ ప్రచారం జరుగుతోంది. వారు తమ వ్యాపారులను దెబ్బ తీస్తున్నారని కొందరు గో బ్యాక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు.
హిందూ సమాజం సంఘటితం అవుతుండటంతో కమ్యూనిస్ట్‌ల ముసుగులో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్లాన్ ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్వాడీలు వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నారన్నారు. అధికారం కోసం, దోపిడీ కోసం రావడం లేదన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉందని బండి సంజయ్ తెలిపారు. మన తెలంగాణ వారు సైతం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారని చెప్పారు.
Bandi Sanjay | రోహింగ్యాలపై మాట్లాడాలి
మార్వాడీలు గో బ్యాక్ అంటూ ప్రచారం చేస్తున్న వారు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తాము రోహింగ్యా గో బ్యాక్ అంటూ ఆందోళనలు చేపడతామన్నారు. అనేక మంది రోహింగ్యా(Rohingya)లు వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్నారన్నారు. హైదరాబాద్ ఐఎస్ఐ అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాలతో ప్రమాదం పొంచి ఉందని వారి గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay | ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా గెలిచింది
ఓటు చోరీ (Vote Chori) ఆరోపణలపై బండి సంజయ్ స్పందించారు. తాము ఓట్ల చోరీ చేస్తే మాకు 240 సీట్లే వస్తాయా అని ప్రశ్నించారు. అలా అయితే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి ఇలా తయారు అయిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
Bandi Sanjay | కులవృత్తులను దెబ్బ తీస్తున్నారు
హిందువుల కుల వృత్తుల కొన్ని వర్గాల వారు దెబ్బ తీస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. హిందువుల పొట్ట కొడుతున్న వారి గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. హిందువుల కుల వృత్తులను కాపాడాలని తాము ఉద్యమం చేస్తామన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తుందన్నారు. బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.