అక్షరటుడే, వెబ్డెస్క్ : GST | వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పన్ను సంస్కరణల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ(Ministry of Finance) కీలక ప్రకటన చేసింది.
ఎంపిక చేసిన వస్తువులకు ప్రత్యేక రేట్లతో పాటు రెండు-శ్లాబ్ GST రేటు నిర్మాణాన్ని ప్రతిపాదించింది. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. ఈ సమస్యను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం GST రేటు హేతుబద్ధీకరణ, సంస్కరణలపై తన ప్రతిపాదనను GST కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి పంపింది.
GST | మోదీ దీపావళి బొనాంజా
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ (Prime Minister Modi) GST పై ప్రకటన చేశారు. సంస్కరణలు పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయని, చిన్న పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రకటించారు.
దీపావళి నాటికి ఈ సంస్కరణలు అమలులోకి వస్తాయన్నారు. గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం జీఎస్టీ విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. పన్ను సంస్కరణల వల్ల సామాన్యులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. నిత్యం వినియోగించే వస్తువుల ధరలు తగ్గడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టవంతమవుతుందన్నారు.
GST | ఆర్థిక శాఖ కీలక ప్రకటన
మోదీ ప్రకటన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రతిపాదనను GoMతో పంచుకుంది. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం కేంద్రం ప్రభుత్వం(Central Government) జీఎస్టీలో మరిన్ని సంస్కరణలను ప్రతిపాదిస్తోందని X లో ఓ పోస్ట్ చేసింది.
నిర్మాణాత్మక సంస్కరణలు, రేటు హేతుబద్ధీకరణ, జీవన సౌలభ్యం వంటి మూడు స్తంభాలపై ఈ బ్లూప్రింట్ రూపొందించినట్లు తెలిపింది. సాధారణ ప్రజలు వాడే వస్తువుల ధరలు తగ్గించే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన మంత్రులతో కూడిన బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఇందులో స్టాండర్డ్, మెరిట్, వంటి రేట్లు మాత్రమే ఉంటాయని వెల్లడించింది.
ప్రస్తుతం, GST 5, 12, 18, 28 శాతం రేట్లతో 4-స్థాయి నిర్మాణాన్ని కలిగి ఉంది. అయితే, ప్రభుత్వం ఇప్పుడు స్లాబ్‌ల తగ్గింపును ప్రతిపాదించింది. కేంద్రం రెండు స్లాబ్‌లతో కూడిన సాధారణ పన్ను వైపు వెళ్లాలని ప్రతిపాదించింది. సామాన్య మానవ వస్తువులు. ఆకాంక్షాత్మక వస్తువులపై పన్నుల తగ్గింపు ఈ ప్రతిపాదనలో ఉంది.
“ఇది స్థోమతను పెంచుతుంది, వినియోగాన్ని పెంచుతుంది. అవసరమైన, ఆకాంక్షాత్మక వస్తువులను విస్తృత జనాభాకు మరింత అందుబాటులోకి తెస్తుంది” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రులతో కూడిన GST కౌన్సిల్, రేటు హేతుబద్ధీకరణపై GoM ప్రతిపాదనపై చర్చించడానికి సెప్టెంబర్‌లో సమావేశం కానుంది.