అక్షరటుడే, ఇందూరు: Nizamabad | సమగ్రాభివృద్ధితో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ (BC Commission Chairman Niranjan) తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. మహాత్మా గాంధీ (Mahatma Gandhi) సారథ్యంలో భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పహల్గాం అమానుష దాడి తరువాత సైన్యం చూపిన చొరవను భారత ప్రజలందరూ గుర్తుంచుకుంటారన్నారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకులకు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Nizamabad | రాష్ట్రంలో అనేక పథకాల అమలు..
జిల్లాలో రైతు భరోసా (Raithu Bharosa), మహాలక్ష్మి (mahalaxmi Scheme), గృహజ్యోతి పథకం (Gruhajyothi Scheme), రైతు రుణమాఫీ (Raithu runa Mafi), ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing scheme) తదితర పథకాలు సజావుగా నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందని నిరంజన్ పేర్కొన్నారు. జిల్లాలో వానాకాలం పంటలో భాగంగా 4.19 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారని తెలిపారు. అవసరమైన ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడం, ఇప్పటివరకు 59,236 మెట్రిక్ టన్నుల యూరియా, 11,385 మెట్రిక్ టన్నుల డీఏపీ, 2,516 మెట్రిక్ టన్నుల పోటాష్, 52,057 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామన్నారు.
అలాగే జిల్లాలో ఇప్పటివరకు 97,696 మంది రైతులకు రూ.755.29 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12వేల పెట్టుబడి సాయం ప్రకటించామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 2,72,589 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.316 కోట్లు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
Nizamabad | భూభారతి చట్టంతో..
కీలక సంస్కరణల్లో ఒకటిగా భూభారతి చట్టం నిలిచిందని నిరంజన్ చెప్పారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేశారని ఇందులో భాగంగా 40,462 దరఖాస్తులు అందాయన్నారు. అలాగే ఇంటిస్థలం కలిగి ఉన్నవారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్నవారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 17,301 ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇప్పటికే 9,486 మార్కింగ్ పూర్తికాగా.. 4,820 ఇల్లు బేస్మెంట్ పూర్తి చేసుకున్నాయని, 742 రూఫ్ లెవెల్, 237 స్లాబ్ లెవెల్ పూర్తయ్యాయన్నారు. ఇందుకు రూ.60.36 కోట్లు అందించామన్నారు.
Nizamabad | ఆహార భద్రతకు భరోసా..
70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. జిల్లాలో మొత్తం 4.03 లక్షల ఆహార భద్రత కార్డుల ద్వారా 13,94,503 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలలకు చెందిన 26,217 మెట్రిక్ ట్రన్నుల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే ఇప్పటివరకు జిల్లాలో 11,852 కొత్త ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశామని తెలిపారు.
Nizamabad | మహాలక్ష్మి పథకం ద్వారా..
మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500 కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అర్హులైనవారికి ఇవ్వడం జరుగుతుందని నిరంజన్ వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 2.19లక్షల వినియోగదారులకు 10.19 లక్షల సిలిండర్లను సబ్సిడీ సిలిండర్లను విడుదల చేసి, రూ.30 73 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు.
Nizamabad | ధాన్యం కొనుగోళ్లు
జిల్లాలో వానకాలం సీజన్లో 676 కేంద్రాల ద్వారా 4,91497 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,140 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అలాగే యాసంగి సీజన్లో 700 కేంద్రాల ద్వారా 8.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1949 కోట్లు చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో 6 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని మహిళలకు రూ.249 కోట్లు ఆదా అయిందని పేర్కొన్నారు.
Nizamabad | ఆసరా పింఛన్లు..
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలోని 2.50 లక్షల మందికి వివిధ రకాల ఆసరా పింఛన్లు భాగంగా రూ.2,016 చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే 18,564 మంది వికలాంగులకు రూ.4,016 నెలవారి పింఛను చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.
Nizamabad | పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ..
జిల్లాలో 9,094 స్వయం సహాయక సంఘాల్లో 90,940 మంది సభ్యులు ఉన్నారని, బ్యాంకు లింకేజీ ద్వారా 638 సంఘాలకు రూ.72 కోట్లు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చినట్లు చెప్పారు. అలాగే పీఎం స్వానిధి కింద నాలుగు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 32,156 మందికి, రెండవ విడతలు రూ.20 వేల చొప్పున 15,564 మందికి, మూడవ విడతలో రూ.50వేల చొప్పున 4923 మందికి రుణాలు ఇచ్చినట్లు తెలిపారు.
Nizamabad | టీబీ ముక్త్ భారత్..
ప్రస్తుతం జిల్లాలో 1,211 మంది క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారని బీసీ కమిషన్ ఛైర్మన్ పేర్కొన్నారు. పోషకాహారం అందించడంలో భాగంగా వారికి నెలకు రూ.500 చొప్పున అందిస్తునామన్నారు. ఇప్పటివరకు రూ. 2.75 కోట్ల అందించడం జరిగిందని వివరించారు. గతేడాది నవంబర్ నుంచి పారితోషికాన్ని రూ. 1,000కి పెంచడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇప్పటివరకు 717 మంది రోగులకు పోషణ కిట్లను ఉచితంగా ఆర్నెళ్ల కొకసారి అందజేయడం జరిగిందని స్పష్టం చేశారు.
Nizamabad | విద్యాశాఖలో..
జిల్లాలో 1,156 పాఠశాలల్లో 90,359 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని నిరంజన్ పేర్కొన్నారు. అలాగే 760 పాఠశాలల్లో అత్యవసర మరమ్మతు పనులు మంజూరు చేయబడ్డాయని, వీటిలో 598 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయన్నారు. ఇందుకోసం రూ.22 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో ధర్పల్లి, ఇందల్వాయి, మెండోరా, రుద్రూర్, మోపాల్ కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 10వ తరగతి అభ్యసించి అత్యంత ప్రతిభ కనపర్చిన బీసీ, ఈబీసీలోని 18 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35 వేల చొప్పున ఉపకార వేతనం మంజూరు చేసి, కార్పొరేట్ కళాశాలలో ప్రవేశం కల్పించబడినట్లు పేర్కొన్నారు.
Nizamabad | మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..
జిల్లాలో మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా 53 చర్చిలు, వాటి ప్రహరీల నిర్మాణ పనులకు గాను రూ.7 కోట్లు, అలాగే 53 ఉర్దూగర్ కం షాదీఖానాల నిర్మాణాల పనులకు గాను మరో రూ.7 కోట్లు పరిపాలన మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
Nizamabad | ఆర్ఓబీ నిర్మాణాలు..
జిల్లాలోని మాధవ నగర్ వద్ద (Madava nagar) కొనసాగుతున్న ఆర్ఓబీ పనులకు రూ.93 కోట్లు మంజూరు చేశామని, అలాగే అర్సపల్లి వద్ద కొనసాగుతున్న ఆర్ఓబీ పనికి రూ.137 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రెండు ఆర్ఓబీలు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు.
జిల్లాలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాంసాగర్ (Nizamsagar) ప్రాజెక్టుల ద్వారా 83,836 ఎకరాలకు, మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టు ద్వారా 53,819 ఎకరాలకు, ఎత్తిపోతల పథకం ద్వారా 745 ఎకరాలకు మొత్తంగా జిల్లాలో 1, 86,200 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందని వివరించారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా 23 నూతనంగా ఏర్పడిన మత్స పారిశ్రామిక సహకార సంఘాలను ఎంపిక చేశామన్నారు. ఒక్కో సంఘానికి రూ.3 లక్షలు మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
Nizamabad | పరిశ్రమల శాఖ..
జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు రూ. 368 కోట్ల పెట్టుబడితో స్థాపించబడ్డాయని నిరంజన్ పేర్కొన్నారు. వీటి ద్వారా 7324 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే 856 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు రూ.485 కోట్లతో స్థాపించబడ్డాయని, వీటి ద్వారా 662 మందికి ఉపాధి కల్పించబడిందని తెలిపారు. అనంతరం పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను సన్మానించారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సత్కరించారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దివ్యాంగులైన స్నేహ సొసైటీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.