అక్షరటుడే, వెబ్‌డెస్క్: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) వార్షిక టోల్ పాస్‌ను అమలులోకి తీసుకొచ్చింది. శుక్రవారం నుంచి రూ.3,000 ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్‌అందుబాటులోకి వచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ టోల్ పాస్ (Toll Pass) ఆధారంగా ఏటా రూ.7 వేల దాకా వాహనదారులకు ప్రయోజనం కలగనుంది. ఈ టోల్ ద్వారా ప్రయాణికులు ఒకే ఛార్జీతో సంవత్సరంలో 200 హైవే టోల్ బూత్‌లను దాటవచ్చు. అయితే, ప్రైవేట్ కార్లు, జీపులు. వ్యాన్ వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వార్షిక టోల్ పాస్ (Annual Toll Pass) వర్తిస్తుంది. టోల్ చెల్లింపుల కోసం ఫాస్ట్ ట్యాగ్ కార్డులను పదే పదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా వార్షిక పాస్ జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో పాస్ ఎలా తీసుకోవాలి. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి.
FASTag | ఏటా రూ.7 వేల ఆదా..
వార్షిక టోల్ పాస్ ద్వారా వాహనదారులకు భారీగానే లబ్ధి చేకూరుతుంది. ఒకసారి రూ.3 వేలతో ఈ పాస్ తీసుకుంటే ఏటా సగటున రూ.7 వేల దాకా ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Highways Minister Nitin Gadkari) చెప్పిన ప్రకారం సంవత్సరానికి రూ.10,000 చెల్లించే ప్రయాణికులు రూ.7,000 ఆదా చేయగలరు, ఎందుకంటే వారు కేవలం రూ.3,000తో సంవత్సరంలో 200 ట్రిప్పులు చేయవచ్చు.
FASTag | హైవేలపై మాత్రమే చెల్లుబాటు
ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ జాతీయ రహదారులు (NH), జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే (NE) ఫీజు ప్లాజాలలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర రహదారులు (SH)లోని ఫీజు ప్లాజాలలో, ఫాస్ట్‌ట్యాగ్ రెగ్యులర్‌గా పనిచేస్తుంది.
FASTag | ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..
వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేయడానికి రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంది. లేదా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (Ministry) అధికారిక వెబ్‌సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. వార్షిక ఫాస్ట్‌ట్యాగ్ పాస్‌ను సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు రీఛార్జ్ చేయవచ్చు. సంవత్సరంలో 200-ట్రిప్‌ల పరిమితిని చేరుకున్న తర్వాత పాస్‌ను మళ్లీ రీఛార్జ్ చేయవచ్చు. ఇప్పటికే ఫాస్టాగ్(FASTag) ఉన్న వారు మళ్లీ కొత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఫాస్టాగ్‌ను ఎలాగైతే రీచార్జ్ చేస్తారో అదే ప్రక్రియ ద్వారా రూ.3 వేలు చెల్లించి వార్షిక టోల్ పాస్‌కు మారవచ్చు.