అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | అభివృద్ధిలో దూసుకుపోతున్న భారతదేశాన్ని అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడుతున్న వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవం(79th Independence Day) సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. అమెరికా, పాకిస్తాన్‌లకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు. రష్యా నుంచి చమురు కొంటుందన్న కారణంతో భారత్‌పై 50 శాతం సుంకాలు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు మోదీ దీటుగా సమాధానమిచ్చారు. కాషాయ తలపాగా, నెహ్రూ జాకెట్, కాషాయ, ఆకుపచ్చ అంచులతో తెల్లటి సఫా స్కార్ఫ్ ధరించిన ఆయన.. శత్రు దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు పంపించారు. రైతులు(Farmers), మత్స్యకారుల(Fishermen) ప్రయోజనాలపై తాను ఎప్పుడూ రాజీ పడనని ప్రధాని మరోసారి ఉద్ఘాటించారు.
PM Modi | రాజీ పడబోం..
ప్రపంచ మార్కెట్‌లో దేశ ప్రతిష్టను పెంచడానికి భారతదేశం అధిక-నాణ్యత ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ప్రధాని మోదీ(PM Modi) తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. “రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారులకే అత్యధిక ప్రాధాన్యమిస్తాం. వారి ప్రయోజనాలకు ముప్పు కలిగించే ఏ విధానమైనా నేను దానికి వ్యతిరేకంగా గోడలా నిలబడతాను. మన రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో భారతదేశం ఎప్పుడూ రాజీపడదు” అని ప్రధానమంత్రి ప్రకటించారు. 21వ శతాబ్దంలో ఇండియా మంత్రం ‘సమృద్ధ భారత్’ కావాలని ఆయన అన్నారు.
PM Modi | పాక్‌కు స్పష్టమైన హెచ్చరిక
భారత్‌పైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్(Pakistan)కు ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇండియా ఎటువంటి అణ్వస్త్ర బెదిరింపులను సహించబోదని పునరుద్ఘాటించారు. అణు బెదిరింపులను ఇక నుంచి సహించేది లేదని, తమ దళాలు తగిన విధంగా సమాధానం ఇస్తాయని స్పష్టం చేశారు. అణ్వస్త్రాలను బూచిగా చూపుతూ భారత్‌పై విమర్శలు చేస్తున్న పాక్ పాలకులకు గట్టిగా బదులిచ్చారు. “అణు బెదిరింపులు చాలా కాలంగా కొనసాగుతున్నాయి, కానీ ఇకపై దానిని సహించము. మన శత్రువులు అలాంటి ప్రయత్నాలలో ఇంకా కొనసాగితే, మన సాయుధ దళాలు ప్రతి స్పందిస్తాయి” అని హెచ్చరించారు. “మా దళాలు వారి స్వంత నిబంధనల ప్రకారం, వారు ఎంచుకున్న సమయంలో, వారు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం ద్వారా అలా చేస్తాయి. తగిన సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని ప్రధాని తేల్చి చెప్పారు.
భారత సాయుధ దళాల ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. మన వీర సైనికులు శత్రువులను వారు ఊహించని విధంగా శిక్షించారన్నారు. “ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన మా ధైర్యవంతులకు నేను వందనం చేస్తున్నాను. మా ధైర్యవంతులైన సైనికులు వారి ఊహకు అందని రీతిలో శత్రువులను శిక్షించారు. ఉగ్రవాదులు రక్తపాతం చేశారు, కాబట్టి మేము వారిని శిక్షించామని” అని తెలిపారు.