అక్షరటుడే, వెబ్‌డెస్క్: UPI services : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) Unified Payments Interface – UPI సేవల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుంది.
యూపీఐ ద్వారా నగదు సేకరించే అవకాశం కలిగించే ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ కనుమరుగవునుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కీలక మార్పు అమలులోకి రానుంది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) National Payments Corporation of India (NPCI) తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.
బ్యాంకులు, పేమెంట్ యాప్స్ (ఫోన్‌పే PhonePe, గూగుల్ పే Google Pay, పేటీఎం Paytm, ఇతర యూపీఐ యాప్స్), యూపీఐ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు.. తమ సాఫ్ట్వేర్ వ్యవస్థలను అక్టోబర్ 1 లోపు అప్డేట్ చేయాలని ఆదేశించింది.
UPI services : ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లోని పీర్-టు-పీర్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను అక్టోబర్ 1, 2025 నుండి నిలిపివేయనున్నట్లు ఎన్ పీసీఐ ప్రకటించింది. యూపీఐ చెల్లింపుల్లో ఆర్థిక మోసాలను నిరోధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘
కలెక్ట్ రిక్వెస్ట్’ లేదా ‘పుల్ ట్రాన్సాక్షన్’ ద్వారా ఒక కస్టమర్ మరో కస్టమర్‌ను డబ్బు అడగవచ్చు. అయితే, ఈ ఫీచర్ ద్వారా ఇటీవల కొందరు కేటుగాళ్లు మోసాలు చేస్తుండడం ఎన్పీసీఐ దృష్టికి వచ్చింది.
డబ్బులు రావాలన్న నెపంతో ‘కలెక్ట్ రిక్వెస్ట్’ పంపిస్తున్నారు. దీన్ని పూర్తిగా గమనించకుండా కస్టమర్లు పిన్ నంబర్ ఎంటర్ చేయగానే డబ్బులు నొక్కేస్తున్నారు.
ఇలాంటి వాటిని నియంత్రించడానికి గాను 2019లో ఎన్పీసీఐ పుల్ బేస్డ్ లావాదేవీలపై రూ.2000 గరిష్ఠ పరిమితి విధించింది. అయినప్పటికీ మోసాలు ఆగకపోవడంతో ఇప్పుడు ఈ ఫీచర్‌ను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది.
UPI services : అనేక మార్పులు..
యూపీఐ అనేది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపుల పద్ధతి, ఈ ప్లాట్‌ఫామ్ నెలకు దాదాపు రూ.25 లక్షల కోట్ల విలువైన 20 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. దేశంలో 40 కోట్ల మంది ప్రత్యేక యూపీఐ వినియోగదారులు ఉన్నారు.
ఈ క్రమంలో కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు ఎన్ పీసీఐ ఎప్పటికప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే వివిధ నిబంధనలను తీసుకొచ్చింది. బ్యాలెన్స్ చెకింగ్ పై పరిమితులు విధించింది.
అలాగే ఆటో పే మోడ్ లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఆప్షన్‌ను పూర్తిగా తొలగిస్తోంది. అయితే, వ్యాపారులు ఇప్పటికీ కలెక్ట్ రిక్వెస్ట్లను కొనసాగించవచ్చు.
ఉదాహరణకు, ఒక వినియోగదారుడు Flipkart, Amazon, Swiggy లేదా IRCTC యాప్లలో UPI చెల్లింపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ వ్యాపారులు కస్టమర్ యాప్‌ను కలెక్ట్ అభ్యర్థనను పంపుతారు. వినియోగదారుడు UPI పిన్ను ఆమోదించి నమోదు చేసిన తర్వాత అభ్యర్థన ప్రాసెస్ చేయబడుతుంది. అలాంటి వాటికి మాత్రమే కలెక్ట్ రిక్వెస్ట్ ఆమోదిస్తారు.