అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రానున్న రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఆశాలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ(Department of Health), జిల్లా పంచాయతీ అధికారి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితి దృష్ట్యా సెలవులను కూడా రద్దు చేయడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయాల్లో చేపట్టే సహాయక చర్యలపై ప్రజలకు భరోసా కల్పించేలా మాక్ డ్రిల్(Mock drill) నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు పర్యాటక ప్రదేశాల వద్ద ప్రజలు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేపల వేట కోసం చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ లోకి దిగకుండా కట్టడం చేయాలని ఆదేశించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.