అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరిగోస పెడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. యూరియా కోసం రైతులు నడిరోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితి కల్పించాయని మండిపడ్డారు.
యూరియా(Urea) ఇవ్వలేని చేతగాని, దద్దమ్మ ప్రభుత్వాలు అని విమర్శించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు సహా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడం లో విఫలం అయ్యారన్నారు. ఎరువుల కొరతపై ఎందుకు నోరు మెదపడం లేదని, రైతుల ఉసురు ఉట్టిగా పోదని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం (Raghavpur Village) వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తిరిన రైతులను చూసిన హరీశ్ రావు తన వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లారు. యూరియా కోసం పడుతున్న తిప్పల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాలపై నిప్పులు చెరిగారు.
Harish Rao | అప్పుడెట్ల వచ్చినయ్.. ఇప్పుడెట్ల రావు..
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేశామని హరీశ్ రావు(Harish Rao) గుర్తు చేశారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వాల వల్ల రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) 51 సార్లు ఢిల్లీ కి పోయిండు కానీ ఎరువుల కొరత తీర్చలేదని మండిపడ్డారు. ‘మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డికి తిట్లు ఎక్కువ పని తక్కువ అని. ప్రజలకు కావాల్సింది తిట్లు కాదు, పని కావాలి.. ముఖ్యమంత్రికి తిట్ల మీద ఉన్న ద్యాస.. పని మీద లేదు.. కేసీఆర్(KCR) ఉన్నపుడు ఎరువులు ఎట్లా వచ్చాయి.. ఇప్పుడు ఎట్లా రావు అని రైతులు సూటిగా అడుగుతున్నారు. సమాధానం చెప్పాలని.’ హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఓటీపీ విధానాన్ని తొలగించాలని, రైతులకు సరిపడా యూరియా అందజేయాలని కోరారు.
Harish Rao | ఇంటికే యూరియా పంపినం..
కేసీఆర్ హయంలో హమాలీ ఖర్చులు ఇచ్చి ఇంటికి యూరియా పంపించినం అని హరీశ్ గుర్తు చేశారు. ఉదయం నుండి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొనే అధికారి లేడని ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. ‘‘పదేళ్లలో కేసీఆర్ హయాంలో ఎరువుల ఇబ్బంది రాలేదు. ప్రతి మండలానికి గోదాంలు ఏర్పాటు చేసుకొని, వేసవి కాలం లోనే ఎరువులు స్టాక్ పెట్టినం. గ్రామం నుంచి రైతు కాలు బయట పెట్టకుండా.. హమాలీ, ట్రాన్స్ పోర్ట్ ఖర్చు లేకుండా రైతు సమయం వృథా కాకుండ గ్రామం లోనే ఎరువులు అందించామని’’ హరీశ్ రావు తెలిపారు.
‘ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్టే మళ్లీ పాత రోజులు వచ్చాయి.. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం, నానో యూరియా వాడాలని చెప్పడం రైతుల పై 500 రూ. అదనపు భారం వేయడమేనన్నారు. నానో యూరియా(Nano Urea)తో రైతులపై ఎకరానికి 500 రూపాయలు భారం పడుతుందని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకోడానికి కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తుందని ఆరోపించారు. ఎన్నికలు ఉన్నాయని బీహార్ కు ఎరువులను తరలిస్తున్నారని విమర్శించారు.