అక్షరటుడే నిజాంసాగర్: Nizamsagar | ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma Housing scheme) ఇసుక సరఫరా పేరుతో పలువురు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా అక్రమ రవాణా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ రేటుకే ఇసుకను సరఫరా చేస్తోంది. అయితే దీనిని సాకుగా తీసుకుని ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ‘ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక’ పేరుతో ఫ్లెక్సీలు లేకుండానే ట్రాక్టర్లలో దర్జాగా ఇసుకను తోలుతున్నారు.
Nizamsagar | జుక్కల్ మీదుగా..
జుక్కల్ (Jukkal) మండలం మీదుగా ప్రభుత్వం అనుమతి పొందిన ట్రాక్టర్కు రూ.900 చెల్లించి దర్జాగా అదే ట్రాక్టర్ను రూ.9వేలకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక (karnataka), మహారాష్ట్ర (Maharashtra) ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలా తరలిస్తున్న ట్రాక్టర్లను మంగళవారం పోలీసులు పక్కా సమాచారం మేరకు పట్టుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే మళ్లీ ఇసుకను దర్జాగా ఇతర ప్రాంతాలను తరలిస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది.
Nizamsagar | ఫ్లెక్సీలు లేకుండానే రవాణాపై అనుమానాలు..
ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma illu) ఇసుకను సరఫరా చేసే ట్రాక్టర్లకు గతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ ముందుభాగంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇసుక పేరుతో ఫ్లెక్సీలు ఉండేవి. ప్రస్తుతం అవేమీ లేకుండానే దర్జాగా ఇసుకను మంజీర నుంచి తోలుతున్నారు. దీంతో అసలు ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేస్తున్నారా.. లేక అక్రమంగా పక్కనే ఉన్న ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారా అనేది అనుమానంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా విలువైన ఇసుకను పక్కా రాష్ట్రాలకు తరలించకుండా పోలీసులు గట్టినిఘా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.